నవజాత శిశువుకు అరుదైన చికిత్స

22 Dec, 2017 01:58 IST|Sakshi

ఓపెన్‌హార్ట్‌ సర్జరీ ద్వారా మైట్రల్‌వాల్వ్‌ సరిచేసిన కేర్‌ వైద్యులు  

సాక్షి, హైదరాబాద్‌ : గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ నవజాత శిశువుకు కేర్‌ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. చికిత్స అనంతరం శిశువు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. హృద్రోగ నిపుణుడు డాక్టర్‌ తపన్‌ కె.దాస్, డాక్టర్‌ నాగేశ్వర్‌ గురువారం ఇక్కడ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చికిత్స వివరాలు వెల్లడించారు. నగరంలోని పాతబస్తీకి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ఖదీర్‌ దంపతులకు ఇటీవల మగశిశువు జన్మించాడు. శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, ఆయాసం వంటి సమస్యలతో బాధపడుతున్న శిశువును స్థానిక వైద్యుల సూచన మేరకు తల్లిదండ్రులు కేర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల్లో శిశువు పుట్టుకతోనే హృద్రోగ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం మూసుకుపోయినట్లు గుర్తించారు. రక్తనాళ మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు.

మైట్రల్‌వాల్వ్‌ పునరుద్ధరణ ద్వారా...
సాధారణంగా ప్రతి వందమంది పిల్లల్లో ఎవరో ఒకరికి మాత్రమే ఇలాంటి సమస్యతో జన్మిస్తుంటారు. తల్లిదండ్రుల అంగీకారంతో 11 రోజుల క్రితం శిశువుకు ఓపెన్‌హార్ట్‌ సర్జరీ చేసి, మైట్రల్‌వాల్వ్‌ను పునరుద్ధరించారు. సాధారణం గా ఇలాంటి కేసుల్లో ఆవు ద్వారా సేకరించిన రక్తనాళం కానీ మెటల్‌వాల్వ్‌ కానీ రీప్లేస్‌ చేస్తారు. గుండె కండరాలకు అతుక్కుపోయిన రక్తనాళాన్ని కట్‌ చేసి సరి చేశారు. 2.6 కేజీల బరువుతో జన్మించిన శిశువుకు ఇలాంటి సర్జరీ చేయడం ప్రపంచంలోనే చాలా అరుదని వైద్యులు ప్రకటించారు. ఇలాంటి చికిత్సలకు రూ.ఆరు లక్షల వరకు ఖర్చు అవుతుండగా, శిశువు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వైద్య ఖర్చులో 50శాతం రాయితీ ఇచ్చినట్లు ఆస్పత్రి సీఈవో రియాజ్‌ తెలిపారు. శిశువుకు భవిష్యత్‌లో ఎలాంటి సమస్య ఉండదని, మరోసారి సర్జరీ చేయాల్సిన అవసరం కూడా రాబోదని డాక్టర్‌ తపన్‌ కె.దాస్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు