అటు సర్వే.. ఇటు సెలవులు!

13 Aug, 2014 01:33 IST|Sakshi
19న సాధారణ సెలవుకు ఆంధ్రా ఉద్యోగుల దరఖాస్తులు
18 నుంచి అసెంబ్లీ ఉన్నందున సెలవులు ఇవ్వడంపై తర్జనభర్జన
 
తెలంగాణలో ఈ నెల 19న నిర్వహించే కుటుంబ సమగ్ర సర్వే ప్రభావం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులపై పడింది. హైదరాబాద్‌లో ఉంటున్నందున సర్వేకు వివరాలు అందించేందుకు సెలవు పెట్టాలని ఏపీలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణయానికి వచ్చారు. 
 
 సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19న నిర్వహించే కుటుంబ సమగ్ర సర్వే ప్రభావం ఏపీ ఉద్యోగులపై పడింది. హైదరాబాద్‌లో ఉంటున్నందున సర్వేకు వివరాలు అందించేందుకు సెలవు పెట్టాలని ఏపీలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణయానికి వచ్చారు. సర్వేలో వివరాలు అందజేయకపోతే భవిష్యత్‌లో పిల్లల చదువులు, ఉద్యోగాలకు ఇంటి చిరునామాతో పాటు ఇతర సర్టిఫికెట్లు కావాలంటే సమస్యలు తలెత్తుతాయనేది ఉద్యోగుల అభిప్రాయంగా ఉంది. సచివాలయంలో ఒక శాఖలోనే మంగళవారం ఏకంగా 20 మంది ఉద్యోగులు సాధారణ సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
 
 హక్కును ఎలా కాదంటాం?
 సాధారణ సెలవు కోరడం ఉద్యోగుల హక్కని, దాన్ని ఎలా తిరస్కరించగలమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 18 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం సాధ్యం కాదని కూడా అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. సచివాలయంతో పాటు విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా సాధారణ సెలవు కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అడిగినవారందరికీ సెలవు మంజూరు చేస్తే 19న ఏపీ సచివాలయంతో పాటు పలు శాఖల కార్యాలయాలు ఉద్యోగులు లేక ఖాళీ అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. సర్వేలో ఏపీ ఉద్యోగులు పాల్గొనకున్నా హైదరాబాద్‌లో ఉంటున్నందున కుటుంబ వివరాలు చెప్పడానికి 19న ఇంటి దగ్గర ఉండక తప్పదని, అందుకే సెలవు కోసం దరఖాస్తు చేశామని సచివాలయ ఉద్యోగి ఒకరు తెలిపారు.
 
 సీఎం, సీఎస్‌లే నిర్ణయం తీసుకోవాలి
 ఏపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులతో పాటు ఆంధ్రా ఉద్యోగులూ సెలవుకు దరఖాస్తులు చేసుకుంటున్నందున సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. 
 
మరిన్ని వార్తలు