కిడ్స్‌కు.. కిడ్నీ గండం!

22 Feb, 2020 01:51 IST|Sakshi

రాష్ట్రంలో 10–19 ఏళ్ల వారిలో క్రియాటిన్‌ అధికంగా ఉన్నవారు 24% 

5–9 ఏళ్ల వయసు పిల్లల్లో క్రియాటిన్‌ అధికంగా ఉన్నవారు 23% 

వీరందరికీ కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం

2016–18 సమగ్ర జాతీయ న్యూట్రిషన్‌ సర్వేలో తేలిన నిజాలు

తల్లిదండ్రులు తప్పక జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

స్థూలకాయం, పోషకాహార లోపమే కారణం..
స్థూలకాయం, పోషకాహార లోపం, జన్యుపరమైన సమస్యలు, అనారోగ్యకరమైన ఆహారం, రసాయనాలతో నిండిన ఆహారం, శారీరక శ్రమ లోపించడం తదితర కారణాల వల్ల కిడ్నీ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా కూల్‌డ్రింక్స్‌ వంటి వాటిని తాగేవారిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇంట్లో తినడానికి బదులు బయట పిజ్జాలు, బర్గర్లు, ఇతరత్రా ఫాస్ట్‌ఫుడ్‌ వంటివి తినడం వల్ల రక్తంలో క్రియాటిన్‌ పెరగడానికి కారణంగా వైద్యులు విశ్లేషిస్తున్నారు. దేశంలో 10 నుంచి 19 ఏళ్ల వయస్సు వారిలో 4.9 శాతం మందికి బీపీ ఉండగా, తెలంగాణలో 6.7 శాతం మంది ఉండటం గమనార్హం. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చిన్న పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు పెద్దలకు మాత్రమే, అదీ బీపీ, షుగర్‌ అధికంగా ఉన్న వారిలోనే కనిపించే కిడ్నీ వ్యాధి ఇప్పుడు పిల్లలనూ వెంటాడుతోంది. 5 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లలపై పంజా విసురుతోంది. 5 నుంచి 9 ఏళ్ల వయసు పిల్లల్లో కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశమున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండగా, 10 నుంచి 19 ఏళ్ల వయసు వారిలో రెండో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2016–18 సమగ్ర జాతీయ న్యూట్రిషన్‌ సర్వేను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో దాదాపు పావు శాతం పిల్లలకు కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. అంటే ఆయా వయసు పిల్లల్లో ప్రతీ నలుగురిలో దాదాపు ఒకరికి కిడ్నీ వ్యాధి ప్రమాదం ఉన్నట్లు నివేదిక తెలిపింది. దీనిపై వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే యువతీ యువకుల భవిష్యత్‌ అంధకారం కానుందని హెచ్చరిస్తున్నారు. 

వారి రక్తంలో సీరం క్రియాటిన్‌ అధికం..
కేంద్రప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వే ప్రకారం వివిధ వయçస్సు వారి ఆరోగ్య వివరాలను సేకరించింది. కిడ్నీ పనితీరును తనిఖీ చేయడానికి వైద్యులు సాధారణంగా బ్లడ్‌ క్రియాటిన్‌ స్థాయిని కొలుస్తారు. ఇది మూత్రపిండాల పనితీరును సూచిస్తుంది. సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 5 నుంచి 9 ఏళ్ల వయసు పిల్లల్లో సరాసరి 7 శాతం మందిలో సీరం క్రియాటిన్‌ అధికంగా ఉన్నట్లు తేలింది. అందులో తెలంగాణలో 23.6 శాతం పిల్లల్లో అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. అలాగే 10 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లల్లో దేశవ్యాప్తంగా 6.6 శాతం మందిలో సీరం క్రియాటిన్‌ అధికంగా ఉన్నట్లు గుర్తించగా, తెలంగాణలో 24.3 శాతం మందికి అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. దేశ సగటు కంటే మూడు నాలుగు రెట్ల వరకు క్రియాటిన్‌ అధికంగా ఉండటం మరింత ఆందోళన కలిగించే పరిణామం. అయితే సీరం క్రియాటిన్‌ అధికంగా ఉన్నా, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సాధారణ పరిస్థితికి రావొచ్చని వైద్యులు చెబుతున్నారు.

మూత్రాశయ సమస్యలు లేదా పుట్టుకతో వచ్చే రుగ్మతల కారణంగా ఒక్కోసారి సీరన్‌ క్రియాటిన్‌ అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్తిస్థాయిలో కిడ్నీలు ఏర్పడకపోవడం, లేదా జన్యుపరమైన సమస్యలు, పర్యావరణం, కాలుష్యం వంటివి కారణాలుగా ఉంటున్నాయని చెబుతున్నారు. పుట్టుకతో వచ్చే కిడ్నీ సమస్యలను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రారంభ దశలోనే గుర్తించడానికి వీలుంటుందని అంటున్నారు. అయితే రాష్ట్రంలో ఇంత అధికంగా ఆయా వయసు పిల్లల్లో క్రియాటిన్‌ అధికంగా ఉండటానికి కారణాలపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు.

మాంసాహారుల్లోనే అధికం..
10 నుంచి 19ఏళ్ల వయసున్న వారిలో బాలికల కంటే బాలురుల్లోనే అధికంగా క్రియాటిన్‌ సమస్యలున్నాయని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఈ వయసు పిల్లల్లో 8.3% మంది బాలురు, 4.9% మంది బాలికల్లో కిడ్నీ సంబంధిత సమస్యలున్నాయని తెలిపింది. మాంసాహారుల్లోనే అధికంగా క్రియాటిన్‌ కని పిస్తోంది. దేశంలో మాంసాహారం తినే ఈ వయసు పిల్లల్లో 9% మందిలో సీరం క్రియాటిన్‌ అధికంగా ఉండగా, కేవలం గుడ్డు తినే వారిలో 6% ఉంది. శాకాహారుల్లో 5.4% మందిలోనే క్రియాటిన్‌ కనిపించి నట్లు నివేదిక తెలిపింది.

మతపరంగా చూస్తే ఈ వయసు పిల్లల్లో అత్యధికంగా క్రిస్టియన్లలో 18.4% మందిలో క్రియాటిన్‌ ఎక్కువ గా ఉండగా, ముస్లింల్లో 11.2% ఉంది. హిందువుల్లో 5.6% ఉం డగా, సిక్కుల్లో 3.8% ఉన్నట్లు నిర్ధారించారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఈ వయసు గల వారిలో ఎస్సీల్లో 6.3%, ఎస్టీల్లో 7.2%, బీసీల్లో 5.1%, ఇతరుల్లో 9.2% క్రియాటిన్‌ ఉన్నట్లు నిర్ధారించారు. ఇదే వయసున్న పట్ట ణపిల్లల్లో 4.3% సీరం క్రియాటిన్‌ ఉండగా, గ్రామీణ ప్రాంత పిల్లల్లో అది 7.4‘% ఉండటం గమనార్హం. నిరుపేదలైన ఈ వయసు పిల్లల్లో 8.9 శాతం సీరం క్రియాటిన్‌ ఉండగా, పేదల్లో 7.4 శాతం, మధ్యతరగతి పిల్లల్లో 7.5 శాతం, ధనికుల్లో 5 శాతం, అత్యంత ధనికుల్లో 4.6 శాతం ఉన్నట్లు నివేదిక తెలిపింది. 

తల్లిదండ్రులు మేల్కొనాలి..
కేంద్ర సర్వే నివేదిక ప్రకారం తెలంగాణలో కిడ్నీ సమస్యలు రావడానికి అవకాశాలెక్కువ. స్థూలకా యం, శారీరక శ్రమ లేకపోవడం, జన్యుపరమైన కారణాలతో ఈ ముప్పు వస్తుంది. ప్రస్తుత నివేదిక హెచ్చరికలాంటింది. పిల్లల తల్లి దండ్రులు జాగ్రత్తలు తీసుకోకుంటే మరింత ప్రమాదం జరగొచ్చు. 
– డాక్టర్‌ గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్, హైదరాబాద్‌

ఆహారం, తాగునీటి లోపాల వల్లే..: 
అనారోగ్యకరమైన ఆహారం, శుద్ధమైన తాగునీరు లేకపోవడంతో కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. పోషకాహార లోపం రాష్ట్రంలో అధికం. ఇది కూడా ఓ కారణమే. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మిషన్‌ భగీరథ నీటితో కిడ్నీ వ్యాధులు తగ్గుతాయి. 
– డా.కిరణ్‌ మాదల, అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, నిజామాబాద్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు