లే ఔట్లు, భవనాలపై సమగ్ర నివేదికివ్వండి

4 Aug, 2018 01:42 IST|Sakshi

పంచాయతీరాజ్‌ అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: నూతన పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి రాక ముందు గ్రామాల పంచాయతీలు ఇచ్చిన లే ఔట్లు, భవన నిర్మాణ అనుమతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టంలో పొందుపర్చిన పలు అంశాలపై శుక్రవారం సచివాలయంలోని చాంబర్‌లో జూపల్లి సమీక్షించారు. హెచ్‌ఎండీఏ, పంచాయతీరాజ్, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. 

పంచాయతీ వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపర్చే దిశగా తీసుకున్న చర్యలను అధికారులు మంత్రికి వివరించారు. ఇప్పటికే లే ఔట్లు, భవన నిర్మాణ అనుమతులు, వ్యాపార, వాణిజ్య అనుమతులు వంటి వాటిని ఆన్‌లైన్‌లో పొందుపర్చడానికి సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసినట్టుగా అధికారులు వివరించారు. గ్రామ పంచాయతీ ఆదాయానికి సంబంధించి దాదాపు 70 శాతం వరకు ఆన్‌లైన్‌లో పొందుపర్చేలా సాఫ్ట్‌వేర్‌ సిద్ధమైందని తెలిపారు.

సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయడంలో జరుగుతున్న జాప్యంపై జూపల్లి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం 300 చదరపు అడుగులకన్నా ఎక్కువ స్థలంలో లేదా జీ ప్లస్‌ 2 కన్నా అదనంగా భవన నిర్మాణ అనుమతులన్నీ హెచ్‌ఎండీఏ లేదా డీటీసీఏ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు,  అధికారులతో జూపల్లి చర్చించారు. 

>
మరిన్ని వార్తలు