రూ.91,727 కోట్ల భారం

23 Sep, 2019 02:03 IST|Sakshi

ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యంతో అంచనాల వ్యయాల్లో పెరుగుదల

కాగ్‌ నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ :రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఎత్తిచూపింది. నిర్మాణాలు పూర్తిచేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రస్తావించింది. రెండేళ్లలో పూర్తికావాల్సిన ప్రాజెక్టులు పదేళ్లు దాటినా పూర్తికాలేదని, దీంతో ప్రాజెక్టుల అంచనా వ్యయాలు భారీగా పెరిగాయని తెలి పింది. 19 ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న జాప్యం వల్ల ప్రభుత్వంపై రూ.91,727 కోట్ల భారం పడిందని పేర్కొం ది. ఆదివారం శాసనసభలో 2017– 18 ఏడా దికి సంబంధించి సమర్పించిన కాగ్‌ నివేదికలో సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని ప్రస్తావించింది.

2018 మార్చి నాటికి రాష్ట్రంలో నిర్మాణ దశలో ప్రాజెక్టులు 36 ఉన్నాయని తెలిపిన కాగ్‌.. ఇందులో 19 ప్రాజెక్టుల నిర్మాణంలో 3 నుంచి 11 ఏళ్ల మేర జాప్యం జరిగిందని తెలిపింది. దీంతో ఈ 19 ప్రాజెక్టుల అంచనావ్యయం రూ.41,201 కోట్లుకాగా, ఇప్పుడు రూ.1,32,928 కోట్లకు పెరిగిందని, దీంతో రూ.91,727 కోట్ల భారం పడిందని పేర్కొంది. ఈ ప్రాజెక్టుల కింద ఇప్పటికే రూ.70,758 కోట్లు ఖర్చు చేసినా అవి ఇంకా పూర్తికాలేదని తెలిపింది. ప్రాజెక్టులను పూర్తి చేయడంతో జాప్యం, ఖర్చుల మీద ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా, ఆశించిన ప్రయోజనాలను, ఆర్థిక వృద్ధిని రాష్ట్రానికి రాకుండా చేసిందని తెలిపింది.

ఏఐబీపీ ప్రాజెక్టులూ అంతే.. 
కేంద్ర పథకం సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం(ఏఐబీపీ) కింద చేపట్టిన ప్రాజెక్టుల పూర్తిలోనూ జాప్యం జరుగుతోందని కాగ్‌ తెలిపింది. దేవాదుల, ఎస్సారెస్పీ–2, ఇందిరమ్మ వరద కాల్వ వంటి ప్రాజెక్టులు చేపట్టి దశాబ్దాలు గడిచినా అవి పూర్తి కాలే దని చెప్పింది. నీటిలభ్యతలో కొరత కారణంగా వాటి పనుల స్వరూపాలు, అంచనాలు మారిపోయాయని, ఈ ప్రాజెక్టుల కింద రూ.16,135 కోట్లు ఖర్చు చేసినా, సాగునీటి వసతుల కల్పన, నీటివినియోగంలో అంతంతమాత్రమే ప్రగతి సాధించిందని పేర్కొంది. భూసేకరణ, పర్యావరణ అనుమతులు వంటి కారణాలతో ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం ఏర్పడిందని తెలిపింది. ఈ దృష్ట్యా సాగునీటి రంగం మీద పెడుతున్న భారీ ఖర్చుకు అనుగుణంగా ఏర్పడుతున్న ప్రయోజనాలను మదింపు చేసేందుకు ప్రభుత్వం వాటి ఫలితాలను సంకలనం చేయాలని, ఈ ఫలితాలు సాగునీటి రంగంలో భవిష్యత్తు పెట్టుబడులకు మార్గసూచిక కావాలని పేర్కొంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు