-

2,325 మంది పిల్లలు బడికి దూరం

26 May, 2014 23:35 IST|Sakshi

 సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: జిల్లాలో 2,325 మంది బడీడు పిల్లలు బడికి దూరంగా ఉన్నారని ఆర్వీఎం నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాని వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇది పొంతన లేని లెక్కేనని పరిశీలకులు చెబుతున్నారు. నిరుపేద పిల్లలకు విద్యను అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. చట్టం వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.

రాజీవ్ విద్యా మిషన్ అధికారులు బడికి దూరంగా ఉన్న పిల్లలను గుర్తించేందుకు నిర్వహిస్తున్న సర్వేలు మొక్కుబడిగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 2,325 మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నారని పట్టణాల్లో 322 మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లడం లేదని ఆర్వీఎం తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికకు, వాస్తవ పరిస్థితులకు ఏ మాత్రం పొంతన లేదని చెప్పవచ్చు. ఒక్క పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతాలలోనే వేలాదిగా బాలకార్మికులు వివిధ ప్రాంతాలలో పని చేస్తూ దర్శనమిస్తున్నారు. పని ప్రదేశాలలో తల్లిదండ్రులకు తోడుగా పిల్లలు పని చేయకుండా పని ప్రదేశంలోనే పాఠశాలలను నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తూవస్తోంది.

ఈ నిధులతో పని ప్రదేశంలో ఉన్న పిల్లలకు విద్యా బోధన చేసేందుకు 20 మంది పిల్లలకు ఒక వలంటీర్‌ను నియమించనున్నారు. జిల్లాలో ప్రధానంగా ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు అధికంగా ఉండడంతో అదే భాషలో విధ్యాబోధన చేయించేందుకు వలంటీర్లను నియమించి గౌరవ వేతనంగా రూ.3 వేలు చెల్లిస్తారు. కాని రెండేళ్ళుగా వర్క్‌సైడ్ పాఠశాల నిర్వహణ కోసం నిధులు ఉన్నా అధికారులు పాఠశాలలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

అమలుకాని నిర్బంధ విద్య
6 నుంచి 14 సంవత్సరాలు గల పిల్లలకు ఉచిత విద్యను అందించాలనే ఉద్దేశంతో 2010 ఎప్రిల్ 1న బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చారు. ఈ చట్టం ద్వారా కనీసం 8వ తరగతి వరకు ఉచిత విద్యను అందించాలనేది ప్రధాన ఉద్దేశం. బడికి దూరంగా ఉన్న పిల్లలను వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్పించి ప్రత్యేక శిక్షణ ద్వారా విద్యను అందించి పాఠశాలలో కొనసాగేలా చూసే బాధ్యత సంబంధిత పాఠశాల హెచ్‌ఎంలతో పాటు స్థానిక విద్యా కమిటీలదేనని పేర్కొన్నారు. బడికి దూరంగా ఉన్న పిల్లలను చదవడం, రాయడం రాదనే కారణంతో పాఠశాలలో చేర్చుకునేందుకు నిరాకరించరాదని చట్టంలో పేర్కొన్నారు. చట్టాలు ఎన్ని ఉన్నా క్షేత్ర స్థాయిలో అమలు చేయకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేకపోతున్నాయి.

బాలకార్మికుల సంఖ్య అధికమే..
జిల్లాలోని వివిధ ప్రాంతాలలో బాలకార్మికులు దర్శనం ఇస్తున్నారు. ఇటుక క్వారీలు, క్రషర్ మిల్లర్స్, హోటల్స్, మెకానిక్ షెడ్‌లు, ఇలా ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారు. బాలకార్మికులతో పని చేయించుకుంటే ఐదు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించే ఆవకాశం ఉంది. కాని సాక్షాత్తూ కార్మికశాఖ అధికారులు ఉండే ప్రాంతాలలోనే బాల కార్మికులు దర్శనమిస్తున్నారు.

సంగారెడ్డిలోని డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం సమీపంలోని వ్యాపార సంస్థలలో బాల కార్మికులు పనులు చేస్తున్నారు. నిత్యం ఈ ప్రాంతంలో కార్మిక శాఖ అధికారులు కార్యాలయాలకు వచ్చివెళ్ళే సమయాల్లో పని చేస్తూ కనిపిస్తున్నా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇలా మెకానిక్ షెడ్‌లు, హోటల్‌లో పని చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రోజురోజుకు బాల కార్మికుల సంఖ్య ఘననీయంగా పెరిగిందని చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు