ఇరుక్కుపోయారు!

13 Oct, 2015 03:34 IST|Sakshi

* ఆందోళనలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు
* హౌసింగ్ నుంచి ఇరిగేషన్‌కు బదలాయింపు
* పని పొంతన లేదు.. పనికి వేతనం లేదు..
* ఇబ్బందిని అధిగమించి మిషన్‌కాకతీయ పనులు
* ఐదు నెలలు గడుస్తున్నా అందని వేతనాలు
సాక్షి, మంచిర్యాల : మిషన్ కాకతీయ.. ఇప్పటి వరకు ఎలాంటి సత్ఫలితాలిచ్చిందో తెలియదు.. రైతులకు ఎలాంటి మేలు చేకూర్చిందో దేవుడే ఎరుగు. కానీ.. జిల్లాలో 49 మంది కుటుంబాలను మాత్రం అయోమయంలో నెట్టేసింది.

ఈ పథకం పుణ్యమా అని ఐదు నెలల క్రితమే గృహనిర్మాణ శాఖ నుంచి మైనర్ ఇరిగేషన్‌కు బదిలీ అయిన ఔట్ సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. గృహనిర్మాణ శాఖలో ని ర్వర్తించిన విధులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులకు పొంతన అసలే లేదు. అనేక కష్టాలకోర్చి మి షన్ కాకతీయ పనుల్ని పర్యవేక్షిస్తున్నా పాలకులు మాత్రం వీరిపై కనికరం చూపడం లేదు. ఐదు నె లలుగా వేతనాలు లేక.. అసలు అవి వస్తాయో రా వోననే బెంగతో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి వే తనాల విషయంలో సంబంధిత ఏజెన్సీ పట్టింపులేకుండా వ్యవహరించడం.. అధికారులూ స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
 
మొదటి 32.. తర్వాత 68 మంది..
ఇందిరమ్మ మొదటి విడతలో భాగంగా జిల్లాకు మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించేం దుకు 2007-08లో అప్పటి ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తొలుత 32 మంది వర్క్‌ఇన్‌స్పెక్టర్లను నియమించింది. క్రమంగా జిల్లాకు ఎక్కువ ఇళ్లు మంజూరు కావడం.. పనులు పర్యవేక్షించే వా రు కొరతగా ఉండడంతో వివిధ సందర్భాల్లో మొ త్తం 68 మంది వర్క్‌ఇన్‌స్పెక్టర్లను తీసుకుంది.

పనిభారాన్ని బట్టి పలు మండలాలకు అధికారులు ముగ్గురు చొప్పున బాధ్యతలు అప్పగించారు. తొ లుత సికింద్రాబాద్‌కు చెందిన శక్తి అనే ఏజెన్సీకి కాంట్రాక్టు అప్పగించిన ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఎన్‌కే ఎంటర్‌ప్రైజెస్‌కు వీరి బాధ్యతలు ఇచ్చారు. ఆయా సంస్థలు ప్రతి నెలా రూ.8,500 వేతనం ఖరారు చేశాయి. అందులో 11 శాతం పీఎఫ్ కోత విధించి.. రూ.7,345 చెల్లిస్తూ వచ్చాయి.
 
కష్టాలు మొదలయ్యాయి ఇలా..
గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూ రులో అవకతవకలు జరిగాయి. ప్రభుత్వం ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణాల మంజూరుకు బ్రేక్ వేసింది. ఇదే క్రమంలో అప్పటి వరకు హౌసింగ్‌లో కొనసాగుతున్న వర్క్ ఇన్‌స్పెక్టర్లకు బాధ్యతలు లేకపోవడంతో.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీ య పనుల్లో వీరి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. వీరిని ఇరిగేషన్ శాఖకు బదిలీ చేస్తూ.. ఈ ఏడాది ఏప్రిల్ 9న ఉత్తర్వులు జారీ చేసింది.

రెండు మూడ్రోజుల్లో నిర్మల్‌లోని ఎస్‌ఈ ఇరిగేషన్ కార్యాలయానికి  వెళ్లి మిషన్‌కాకతీయ బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది. వీ రిలో 49 మంది మాత్రమే విధుల్లో చేరారు. మే 20 నుంచి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఇరిగేషన్ ఏఈ ల కింద బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే.. గ తంలో వారు చేసిన పనికి ప్రస్తుతం చేయాల్సిన పనికి పొంతన లేకున్నా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.

సివిల్ వర్క్స్‌పై అవగాహన ఉన్న ఉద్యోగులు పలుచోట్ల ఏఈల స్థాయి లో పనులు చేస్తున్నారు. అయినా.. వీరికి వేతనాల విషయంలో ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయమై ‘సాక్షి’ మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ భగవంతరావు వివరణ కోసం ప్రయత్నించగా ఆయన ఫోన్లో అందుబాటులో లేరు.

మరిన్ని వార్తలు