ఎదురు చూపులు

5 Nov, 2014 03:10 IST|Sakshi

మంచిర్యాల సిటీ : 2014-16 విద్యాసంవత్సరంలో డీఎడ్ ప్రవేశానికి సంబంధించిన డైట్‌సెట్-14 ప్రవేశ పరీక్ష ఫలితాలు ప్రకటించి మూడు నెలలకు చేరుకుంది. ర్యాంకులు మాత్రం విద్యాశాఖ ప్రకటించక పోవడం శోచనీయం. కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించడంలో విద్యాశాఖ నిర్లక్ష్యం వహించడంపై విద్యార్థులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

  ఏ విషయాన్ని స్పష్టంగా విద్యాశాఖ చెప్పక పోవడంతో విద్యార్థులు వారి తల్లి దండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించడానికి రెండు రాష్ట్రాల అనుమతి తప్పని సరి అయ్యింది. దీంతో కౌన్సిలింగ్‌లో జాప్యం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సమైఖ్య రాష్ట్రంలో కూడ కౌన్సిలింగ్ ఆలస్యమై తరగతులు నవంబర్, డిశెంబర్‌లో ప్రారంభమైన సంధర్భాలు ఉన్నాయని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

జిల్లాలో మూడు వేల మంది విద్యార్థులు ఆర్హత పరీక్ష రాసి ర్యాంకులు, కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎస్‌జీటీ పోస్టులకు ప్రాధాన్యత పెరిగినందువలను ఎక్కువ మంది విద్యార్థులు డీఎడ్ వైపు మొగ్గుచూపుతున్నారు. డిగ్రీ చదవ కుండానే డీఎడ్ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తితో స్థిరపడవచ్చుననే విద్యార్థులకు అధికారుల నిర్లక్ష్యం ఇబ్బందికరంగా తయారైందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.  

 కళాశాలలు..
 జిల్లాలో మంచిర్యాల, ఉట్నూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్(2), నిర్మల్‌లో కలిపి మొత్తం ఆరు  డీఎడ్ కళాశాలలు ఉన్నాయి. ఒక్కొక్క కళాశాల లో 50సీట్లు ఉంటాయి. 40సీట్లు కన్వినర్ కౌన్సిలింగ్ ద్వార భర్తీ అవుతాయి. మిగాతా 10 సీట్లు యాజమాన్యాల కోటా కింద భర్తీ అవుతాయి.

 30 వేల మంది..
 జిల్లాలో సుమారు ముప్పైవేల మంది విద్యార్థులు డీఎడ్ అర్హత పరీక్షకు హాజరైనారు. ఫలితాలు ప్రకటించి ర్యాంకులను వెల్లడించక పోవడంతో వీరంతా గడిచిన రెండు నెలల నుంచి కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.

 పరీక్ష నిర్వహించినా..
 జూన్ నెలలో ఉన్నత విద్యాశాఖ  డీఎడ్ అర్హత పరీక్షను నిర్వహించింది. ఫలితాలను ఆగస్టులో ప్రకటించింది. మార్కులను తెలిపి, ర్యాంకుల ను మాత్రం ప్రకటించలేదు.సెప్టెంబర్‌లో కౌన్సి లింగ్ పూర్తి చేసి, అక్టోబర్‌లో తరగతులను ప్రా రంభించాలి. 2013లో డిశెంబర్‌లో, 2012లో నవంబర్‌లో తరగతులు ప్రారంభమైనాయి.

 విద్యార్థులకు నష్టం
 ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు అంతా కూడ డీఎడ్ అర్హత పరీక్షకు హాజరైనారు. ఫలితాలు ప్రక టించి ర్యాంకులు ప్రకటించక పోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. సీటు వచ్చేంత ర్యాంకు వస్తుందా? రాదా? అనే అనుమానంతో కొట్టుమిట్టాడుతున్నారు. అదే  విధంగా సీటు వస్తుందనే ఆశతో పలువురు విద్యార్థులు డిగ్రీలో చేరకుండా కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక కోర్సులో చేరకుండా విద్యాశాఖ నిర్లక్ష్యం మూలంగా ఏడాది చదువును నష్టపోతామనే ఆందోళనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు  ఉన్నారు.

>
మరిన్ని వార్తలు