బెర్త్ ఎవరికో..!

14 Dec, 2014 02:03 IST|Sakshi
బెర్త్ ఎవరికో..!

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/చెన్నూరు : ఎన్నో రోజులుగా ఊరిస్తున్న మంత్రి వర్గ విస్తరణ అంశం ఎట్టకేలకు తెరపైకి రావడంతో ఈ పదవులను ఆశి స్తున్న నేతలతోపాటు, రాజకీయ వర్గాల్లో ఉత్కం ఠ నెలకొంది. మంత్రి వర్గంలో మరో ఆరుగురికి చోటు కల్పించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాకు మరో మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ముఖ్యంగా నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇందుకోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ప్రకటించిన మాదిరిగానే చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు ప్రభుత్వ విప్ పదవి ఖరారైంది.

మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఓదేలుకు సీఎం కేసీఆర్‌తో అత్యంత సన్నిహితునిగా పేరుంది. ప్రభుత్వ విప్‌గా ఓదెలు పేరు గతంలోనే వినిపించినా ఇప్పటికి ఖరారైంది. మంత్రి పదవులు ఆశిస్తున్న ఇంద్రకరణ్‌రెడ్డికి సీనియర్ నేతగా పేరుంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో సొంత చరిష్మతో విజయం సాధించిన ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇంద్రకరణ్‌రెడ్డికి మంత్రి పదవి దక్కడం ఖాయమని ఆయన అనుచర వర్గాలు భావిస్తున్నాయి. అలాగే కోవ లక్ష్మికి కూడా ఈ పదవి దక్కడంలో సమీకరణాలు కలిసొస్తున్నాయని ఆమె అనుచర వర్గాలు భావిస్తున్నాయి. ఆమెకు ఈ పదవి ఇవ్వడం ద్వారా ఇటు మహిళా కోటా, మరోవైపు గిరిజనుల కోటా కింద పదవి ఇచ్చినట్లు అవుతుందని, పైగా ఆదివాసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని కోవ లక్ష్మి అనుచర వర్గాలు పేర్కొంటున్నాయి.

నామినేటెడ్ పదవులపై..
రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఎమ్మెల్యేలను నియమిం చాలని కేసీఆర్ యోచిస్తున్నారు. అలాగే పార్లమెంట్ సెక్రటరీలుగా ఎ మ్మెల్యేలను నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. దీంతో జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేల్లో ఈ పదవులపై ఆశలు చిగురిస్తున్నాయి. కొత్తగా మంత్రి వర్గంలో చేరే మంత్రులు ఈనెల 16న ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. దీంతో ఈ పదవులు దక్కనున్న వారికి ఆది, సోమవారాల్లో కేసీఆర్ నుంచి పిలుపు వచ్చే అవకాశాలున్నాయి.

బాధ్యత మరింత పెరిగింది : ఓదెలు
బంగారు తెలంగాణ నిర్మాణంలో మరింత బాధ్యత పెరిగిందని చెన్నూ ర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. ప్రభుత్వం నల్లాల ఓదెలును శని వారం ప్రభుత్వ విప్‌గా నియమించగా ‘సాక్షి’ ఆయనను ఫోన్‌లో పలకరించింది. ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తనపై నమ్మకంతోనే ప్రభుత్వ విప్‌గా నియమించారని తెలిపారు. కేసీఆర్ ప్రవేశ పెడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు వివరిస్తానన్నారు. అన్ని రంగాల్లో నియోజవర్గాన్ని అభివృద్ధి పరుస్తానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు