ముహూర్తం ఖరారు

14 Dec, 2014 09:10 IST|Sakshi
ముహూర్తం ఖరారు

జలగంకు సహాయ మంత్రి హోదాతో పార్లమెంటరీ సెక్రటరీ పదవి
కేబినెట్‌లో కీలకం కానున్న ఖమ్మం  
పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు

మంత్రివర్గంలో టీఆర్‌ఎస్ నేత తుమ్మలకు చాన్స్
 
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆరు నెలల పాటు ఎదురుచూసిన జిల్లా ప్రజల కల ఎట్టకేలకు సాకారం కానుంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో మంత్రివర్గంలో జిల్లాకు స్థానం లభించడం ఖాయమైంది. అధికార పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యానికి నోచుకోని జిల్లాల్లో ఒకటైన ఖమ్మానికి ఆలోటు తీరనుంది.

జిల్లానుంచి మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రివర్గంలో అవకాశం దక్కడం దాదాపు ఖాయమైంది. అలాగే టీఆర్‌ఎస్ నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన జలగం వెంకట్రావుకు సైతం సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంటరీ కార్యదర్శి పదవి ఖరారైంది. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జిల్లాకు మంత్రి వర్గంలో స్థానం లేకపోవడంతో పాలనా పరంగా, పార్టీ పరంగా కొంత నిస్తేజం అలుముకుంది. అయితే ఈ మూడు నెలల్లోనే జిల్లాలో అనూహ్య రాజకీయ పరిణామాలు సంభవించి వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు టీఆర్‌ఎస్‌లో చేరారు.

టీడీపీలో అగ్రనేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో గత సెప్టెంబర్‌లో తన అనుచరులతో టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. అప్పటి నుంచి  ఆయనకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుందనే ప్రచారం జోరందుకుంది. కేసీఆర్ అదృష్ట సంఖ్యలుగా భావించే 6, 15, 24 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రతినెలా ఎదురుచూశాయి. మంత్రివర్గంలో ఒక్కరికే ప్రాతినిధ్యం లభిస్తుందని మొదటి నుంచి అనుకుంటున్నా అనూహ్యంగా సహాయ మంత్రి హోదా కలిగిన మరో పదవిని సైతం కొత్తగూడెం ఎమ్మెల్యే వెంకట్రావుకు కేటాయిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వంలో జిల్లాకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కేసీఆర్ రాష్ట్రస్థాయిలో పరిమితంగా భర్తీ చేసిన కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లోనూ మన జిల్లాకు చెందిన విద్యార్థి ఉద్యమ నేత, గార్ల నివాసి పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించి జిల్లాకు తాను ఇచ్చే ప్రాధాన్యతను చాటి చెప్పారని టీఆర్‌ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అయితే తుమ్మలకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. 1978లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ఇద్దరికి సహాయ మంత్రి హోదా కలిగిన కేబినెట్ కార్యదర్శి పదవులను అప్పగించారు.

ఆ తర్వాత అలాంటి సంప్రదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వంలోనూ కొనసాగలేదు. మళ్లీ కేసీఆర్ పార్లమెంటరీ సెక్రటరీ పదవులను అప్పగించడంతో 36 సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి సహాయ మంత్రుల హోదా కలిగిన ఈ పదవులు రానున్నాయి. ఇందులో ఒకటి జలగం వెంకట్రావును వరిస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఈనెల 16న జరగనున్న మంత్రివర్గ విస్తరణలో తుమ్మల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఆనందంతో ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రాజధానికి తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావుకు తెలంగాణ మంత్రి వర్గంలో కీలకశాఖ వరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆయనకు హోం, ఆర్‌అండ్‌బీ, విద్యుత్ వంటి కీలక శాఖలను అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఆనంద పడుతున్నాయి. 1983లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేయడం ద్వారా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తుమ్మల 1985లో తొలిసారిగా సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్‌టి రామారావు మంత్రివర్గంలో చిన్ననీటి పారుదలశాఖా మంత్రిగా తొలి బాధ్యతలు నెరవేర్చారు.

కొంతకాలం వరంగల్ రీజియన్ ఆర్టీసీ చైర్మన్‌గా సైతం పనిచేశారు. 1989లో ఓటమి చవిచూసిన తుమ్మల 94, 99లో తిరిగి సత్తుపల్లి నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోనూ కీలకమైన భారీ నీటిపారుదల, రహదారులు భవనాలు, ఎక్సైజ్ వంటి శాఖలు నిర్వహించారు. 2009లో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసిన తుమ్మల అప్పుడు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంకట్రావుపై విజయం సాధించారు.

దాదాపు 10 సంవత్సరాల తర్వాత తుమ్మల మళ్లీ మంత్రి అవుతున్నారు. తుమ్మలకు మంత్రివర్గంలో స్థానం లభించడం, జలగం వెంకట్రావుకు సహాయమంత్రి హోదా కలిగిన పదవి లభిస్తుండటంతో జిల్లా రాజకీయాలు మరింత వేగవంతమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనపడుతోంది. 2004లో రాజకీయ అరంగేట్రం చేసిన జలగం వెంకట్రావు సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మాజీమంత్రి తుమ్మలపై విజయం సాధించారు.

అనంతరం 2009లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఖమ్మం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2014లో టీఆర్‌ఎస్‌లో చేరి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అనంతర పరిణామాలతో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇల్లెందు శాసనసభ్యుడు కోరం కనకయ్య, వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీ శాసనసభ్యుల సంఖ్య మూడుకు చేరింది.  

జిల్లాలో ఇప్పటి వరకు రాజకీయంగా అధికార పార్టీలో నెలకొన్న కొంత స్తబ్ధత మంత్రివర్గ విస్తరణ అనంతరం తొలగనుంది. అలాగే పాలనా వ్యవహారాల్లోనూ జిల్లాకు అధికార పార్టీ ముద్ర పెద్దగా కనిపించకపోవడంతో తెలంగాణ ఉద్యమంలో కష్టించి పనిచేసిన వారిలో, టీఆర్‌ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. ఇప్పుడు కేబినెట్‌లో చోటు లభించడం ఖాయం కావడంతో అభివృద్ధి పరంగా జిల్లా రూపురేఖలు మారనున్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు