రేషన్.. పరేషాన్ !

16 Oct, 2014 03:28 IST|Sakshi
రేషన్.. పరేషాన్ !

* అనుసంధానం కానీ ‘ఆధార్’
* కోటాలో కోత..
* తాజా దరఖాస్తులతో ఆందోళన

బాన్సువాడ:  తెల్లరేషన్ కార్డులు ఉన్నవారు ఆధార్‌కార్డులను అందించాలని చెప్పడంతో అందరూ అందజేశారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండునెలలుగా రేషన్‌కోటాలో కోత తప్పడం లేదు. రచ్చబండ కార్డులతో పాటు, గతంలో ఉన్న కార్డుల లబ్ధిదారుల ఆధా ర్ నమోదు ప్రక్రియ కొనసాగుతుండగా, వాటిని సకాలంలో అనుసంధానం చేయడం లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆహార భద్రతా కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొనడంతో లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు.
 
ఆధార్ నంబర్‌తో..
రేషన్ కార్డుల్లో పేర్లు నమోదై ఉన్న వారంతా తమ ఆధార్ కార్డు నంబర్‌ను అనుసంధానం చేయాలని కలెక్టర్ ఆదేశించడంతో అధికారులు ఆధార్ అనుసంధానం ప్రక్రియను దాదాపు పూర్తి చేస్తున్నారు. అయితే ఆధార్ జిరాక్సు కాపీలను చౌకధరల దుకాణాల్లో ఇచ్చినా తమ కార్డును అనర్హుల జాబితాల్లో చేర్చుతున్నారని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ నంబర్‌ను ఇచ్చినా పలువురు లబ్ధిదారులకు చౌకధరల దుకాణాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం లేదు.  
 
అనర్హులుగా లబ్ధిదారులు
జిల్లావ్యాప్తంగా రేషన్ కార్డుదారుల ఆధార్ నంబర్లను సేకరించి అనుసంధానం చేసే ప్రక్రియ గత ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా కార్డుదారులు తమ ఆధార్ కార్డు జిరాక్సులను చౌక దుకాణాల్లో డీలర్లకు అందజేస్తున్నారు. ఇలా ఇచ్చిన ఆధార్ నెంబర్లను ఆన్‌లైన్ డేటాలో నమోదు చేయాల్సి ఉంది. ఇక్కడే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కార్డు దారులు ఆధార్ నెంబర్లు ఇచ్చినా డేటా ఎంట్రీలో నిర్లక్ష్యం వల్ల వారి పేర్లు అనర్హుల జాబితాకు చేరుతున్నాయి.

వీటికి ప్రస్తుతం రేషన్ పంపిణీ నిలిచిపోయింది. వారికి చౌకధరల దుకాణాల్లో డీలర్లు సరుకులు పంపిణీ చేయడం లేదు. ఆధార్ అనుసంధాన కంప్యూటరీకరణ ప్రక్రియ సక్రమంగా పూర్తి చేస్తేనే కార్డుల లబ్ధిదారులకు ఈ ఇబ్బందులు తొలగుతాయి. ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాల్లో రేషన్ కార్డులను మంజూరు చేయగా, అప్పట్లో కార్డులైతే ఇచ్చారు కానీ వీరి పేర్లు ఆన్‌లైన్ డేటాబేస్‌లో నమోదు చేయలేదు. దీంతో అప్పటి నుంచి రచ్చబండ కార్డుదారులకు ప్రత్యేకంగా కూపన్లు జారీ చేసి సరుకుల పంపిణీ చేస్తూ వచ్చారు. జిల్లాలో సుమారు 40వేల మంది రచ్చబండ కార్డు దారులు ఉండగా, వీరిలో వేలాది మంది పేర్లు డేటాబేస్‌లో నమోదు కాలేదు. దీంతో వీరికి సంబంధించిన కోటాను కూడా చౌకధరల దుకాణాలకు నిలిపివేశారు. దీంతో లబ్ధిదారులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
 
ఆహార భద్రతాకార్డులతో గందరగోళం
రేషన్ కార్డులు ఉన్నా.. ఆహార భద్రతా కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని తాజాగా ప్రభుత్వం ఆదేశించడంతో లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికే ఆధార్ అనుసంధానం ఇబ్బందులు పెడుతుండగా, మళ్లీ ఇప్పుడు తాజా దరఖాస్తు చేసుకోవాలనడంతో గందరగోళానికి గురవుతున్నారు.

మరిన్ని వార్తలు