కటాఫ్‌ మార్కుల్లో వ్యత్యాసాలు.. 

26 Sep, 2019 03:08 IST|Sakshi
ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్‌ అభ్యర్థులు

డీజీపీ కార్యాలయం వద్ద కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కానిస్టేబుల్‌ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ) మంగళవారం రాత్రి ప్రకటించింది. ఇందులో తమ కటాఫ్‌ మార్కుల్లో వ్యత్యాసాలు వచ్చాయని పలువురు అభ్యర్థులు బుధవారం ఉదయమే డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ బోర్డు చైర్మన్‌ శ్రీనివాసరావును కలవాలని ప్రయత్నించారు. వారి వద్ద వినతిపత్రాలు తీసుకున్న పోలీసులు తిప్పి పంపారు. దీనిపై టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ స్పందించింది. ఈ విషయంలో అభ్యర్థులకు అనుమానాలు అక్కర్లేదని, ఒకవేళ అభ్యంతరాలు ఉంటే బుధవారం సాయంత్రం నుంచి టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చైర్మన్‌ శ్రీనివాసరావు సూచించారు. 

డిప్లొమా అభ్యర్థుల ఆవేదన..: డిప్లొమా చేసిన అభ్యర్థులను కానిస్టేబుల్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు తొలుత అనుమతించలేదు. వీరంతా కోర్టును ఆశ్రయించారు. ఇంటర్‌ ఫెయిలైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు, డిప్లొమా ఫెయిలైన అభ్యర్థుల సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. డిప్లొమా అభ్యర్థులు 6 సెమిస్టర్ల సర్టిఫికెట్లు చూపాలని స్పష్టం చేసింది. దీంతో పలువురు అభ్యర్థులు వెరిఫికేషన్‌కు 6 సెమిస్టర్ల సర్టిఫికెట్లు చూపలేకపోయారు. అలాంటి అభ్యర్థుల వివరాలను కటా ఫ్‌ మార్కుల వెల్లడిలో వారిని పరిగణనలోకి తీసుకోలేదు. వీరంతా తమకు న్యాయం చేయాలని కోరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా