రైతు ఆత్మహత్యల్లేని రోజులు రావాలి

30 Jan, 2019 03:32 IST|Sakshi

రుణమాఫీ జరిగే వరకు పాలకులను నిద్రపోనివ్వొద్దు

దక్షిణాది రాష్ట్రాల సదస్సులో ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ చైర్మన్‌ నానా పటోలే

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రైతు ఆత్మహత్యల్లేని రోజులు రావాలని, ఇందుకోసం పాలకులు సరైన విధానాలను రూపొందించాలని ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ చైర్మన్‌ నానాపటోలే అన్నారు. రైతులకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ఒక్క హామీనీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి అధ్యక్షతన మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల కిసాన్‌ కాంగ్రెస్‌ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

నానా పటోలే మాట్లాడుతూ దేశంలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. రైతు రుణమాఫీ హామీ నెరవేర్చే వరకు పాలకులను నిద్రపోనివ్వద్దని పిలుపునిచ్చారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకతీతంగా రైతాంగం రోడ్ల మీదకు వచ్చి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీల కోసమే పనిచేస్తోందని, కార్పొరేట్‌ కంపెనీల కోసమే ఫసల్‌ బీమా పథకాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. రైతాంగాన్ని కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.  

వైఎస్‌ హయాంలో 15 రోజులకోసారి సమీక్ష 
ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ తాను చూసిన ముఖ్యమంత్రుల్లో రైతుల సమస్యలపై 15 రోజులకోసారి సమీక్ష నిర్వహించింది వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమేనని చెప్పారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ విదేశాల్లో తిరిగే మోదీ, సచివాలయానికి రాని కేసీఆర్‌ల పాలనలో రైతులు నానాకష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీనియర్‌ నేత వి. హనుమంతరావు తదితరులు సదస్సులో రైతులనుద్దేశించి ప్రసంగించారు. సదస్సులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, సుధీర్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కిసాన్‌ కాంగ్రెస్‌ నేతలు అన్వేశ్‌రెడ్డి, కె.వి.రామారావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పంట పరిహారం అందిన దాఖలాల్లేవు: భట్టి విక్రమార్క
కిసాన్‌ కాంగ్రెస్‌ సదస్సులో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ తమ హయాంలోనే వ్యవసాయం పండుగలా మారిందని అటు మోదీ, ఇటు కేసీఆర్‌ ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి ఆహారధాన్యాలను దిగుమతి చేసుకునే స్థాయిలో ఉన్న దేశాన్ని ఆహార ధాన్యాలను ఎగుమతిచేసే స్థాయికి కాంగ్రెస్‌ పార్టీ తీసుకు వచ్చిందని, గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిన కృషి వల్లే రైతులు, రైతు కూలీలు ఈ మాత్రమైనా బతకగలుగుతున్నారని అన్నారు.

మరిన్ని వార్తలు