ఆర్టీసీ సమ్మె : కత్తెర పట్టిన కండక్టర్‌

12 Nov, 2019 03:13 IST|Sakshi

నిర్మల్‌ అర్బన్‌: ఓ ఆర్టీసీ కండక్టర్‌ కత్తెర పట్టాడు. ఆర్టీసీ సమ్మె కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబ పోషణ నిమిత్తం కులవృత్తిని చేపట్టాడు. నిర్మల్‌ రూరల్‌ మండలం రత్నాపూర్‌ కాండ్లీకి చెందిన మహిపాల్‌ గతంలో సెలూన్‌ నిర్వహించేవాడు. 2009లో ఆర్టీసీ కండక్టర్‌గా విధుల్లో చేరాడు. అప్పటి నుంచి కులవృత్తిని వదిలేశాడు. నిర్మల్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వచ్చే జీతంలో ఇంటి కిస్తీలు చెల్లిస్తూ.. పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు. అప్పటికే నెల జీతం రావాల్సి ఉంది. సమ్మె కారణంగా మరో నెల జీతం రాకుండా పోయింది. రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఏం చేయాలో పాలుపోక కులవృత్తి అయిన.. తనకు వచ్చిన పనిని చేపడుతున్నాడు. సమస్యల పరిష్కారం కోసం అటు సమ్మెలో పాల్గొంటూ.. కుటుంబ పోషణ కోసం కులవృత్తిని చేపడుతున్నాడు.

మరిన్ని వార్తలు