సర్వం సిద్ధం

22 Jan, 2016 02:37 IST|Sakshi

రేపటి నుంచి మహిళా ఉద్యోగుల సదస్సు
రెండు రోజుల పాటు నిర్వహణ
{పారంభించనున్న సీఎం కేసీఆర్
నిట్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి
టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి వెల్లడి

 
హన్మకొండ చౌరస్తా : వరంగల్ నిట్ వేదికగా ఈ నెల 23, 24 తేదీల్లో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ మహిళా ఉద్యోగుల సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబిస్తారని చెప్పారు. హన్మకొండలోని టీఎన్జీవోస్ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు.  అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న మహిళా ఉద్యోగులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకల సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సద స్సు కొనసాగుతుందన్నారు. మహిళా చట్టాల అమలు, సమస్యల పరిష్కారంపై సదస్సులో చర్చించి, డిక్లరేషన్ ఇవ్వనున్న ట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్ విదానంతో ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, పాత విధానాన్నే అమలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని అన్నారు.

మహిళల సంక్షేమమే ద్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను జాతీయ స్థాయిలో తీసుకెళ్లేలా సదస్సులో తీర్మానం చేస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్, జాతీయ సదస్సు ఆహ్వాన కమిటీ చైర్మన్ పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు స్ఫూర్తి గా నిలిచిందని, ఇక్కడ మహిళా ఉద్యోగుల జాతీయ సదస్సు నిర్వహించడంతో జిల్లా ప్రతిష్ట మరింత పెరుగుతుందని అన్నారు. మహిళలపై కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా రజియాసుల్తానా, రుద్రమదేవి, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో ఐక్య పోరాటాలు చేస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన మహిళా భద్రత, సంక్షేమం కోసం షీ టీమ్స్, షీ షటిల్స్, కళ్యాణలక్ష్మి వంటి పథకాలు దేశానికే ఆదర్శమని అన్నారు.

జాతీయ సదస్సుకు హాజరయ్యే ఉద్యోగిణులకు ప్రభుత్వం సెలవుగా ప్రకటిం చడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు కోలా రాజేశ్‌గౌడ్, టీజీఓ జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, టీఎన్జీఓ మహిళా విభాగం అధ్యక్షురాలు విజయలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ హమీద్, రత్నవీరాచారి, రాంకిషన్, సోమయ్య, పుల్లూరి వేణుగోపాల్, పిన్నా మహేందర్, రాజ్యలక్ష్మి, వనజ, ఉపేందర్‌రెడ్డి, హసదుద్దీన్, రామునాయక్, ఆనంద్, అలివేలు, మంగతాయి, సదానందం పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు