జావీద్‌కు ఐసీస్‌తో సంబంధం లేదని నిర్ధారణ..!

3 Feb, 2015 04:36 IST|Sakshi

యువకుడితో పాటు కుటుంబ సభ్యులకు బెంగళూరు పోలీసుల కౌన్సెలింగ్
ఖమ్మం క్రైం: నగరానికి చెందిన యువకుడికి ఐసీస్(ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థతో  సంబంధం లేదని పోలీసులు నిర్ధారించినట్లు తెలిసింది. నగరంలోని పంపింగ్ వెల్ రోడ్డు ప్రాంతానికి చెందిన షేక్ జావీద్(25)  బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఐదు రోజుల క్రితం అతను  తొమ్మిది మందితో కలిసి టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ వెళ్లగా అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరిని విచారించగా సిరియాలోని ఉగ్రవాద సంస్థలో చేరుందకు వెళుతున్నట్లు తెలియడంతో వెంటనే బెంగళూరుకు తరలించారు. దీంతో అక్కడి పోలీసులు వెంటనే జావీద్‌కు కుటుంబ వివరాలు తెలియజేయాలని ఆదేశించడంతో ఖమ్మం ఎస్బీ పోలీసులు రంగంలోకి దిగారు. జావీద్ బంధువులతో పాటు అతని కుటుంబ సభ్యులను విచారించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అంతకు ముందే జావీద్ తండ్రికి బెంగళూరు పోలీసులు ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పడంతో ఆయన వెళ్లాడు.

బెంగళూరులో ఉన్న చిన్న కుమారుడిని తీసుకుని అక్కడి పోలీసులను కలిశాడు. అదే సమయంలో ఖమ్మం పోలీసులు ఇక్కడ విచారణ చేపట్టారు. రెండు నెలల క్రితమే ఖమ్మం వచ్చిన జావీద్ తనకు సౌదీలో ఉద్యోగం వచ్చిందని చెప్పివెళ్లిపోయాడు. కానీ అతను టర్కీలో పోలీసులకు పట్టుబడడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువుల ఆందోళనకు గురయ్యారు. సోమవారం అన్ని పత్రికల్లో నగరానికి చెందిన యువకుడికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు కథనాలు రావడం, అతని ఇంటికి ఎస్‌బీ, ఇంటిలిజెన్స్, త్రీటౌన్ పోలీసులు, మీడియా రావడంతో స్థానికంగా కలకలం రేగింది.
 
సంబంధం లేదని నిర్ధారించిన పోలీసులు..!    
జావీద్‌కు ఐసీస్‌తో సంబంధాలు లేవని బెంగళూరు పోలీసులు నిర్ధారించినట్లు తెలిసింది. అతనితోపాటు తొమ్మిది మంది ఉగ్రవాద సంస్థ పట్ల ఫేస్ బుక్ ద్వారా ఆకర్షితులై అక్కడికి వెళ్లినట్లు అక్కడి పోలీసులు విచారణలో తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జావీద్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా..? లేవా..? అనే కోణంలో పోలీసులు విచారించినట్లు తెలిసింది.
 పట్టుబడినవీరు సిరియా వెళ్లడానికి డబ్బులు ఎవరు సమకూర్చాలు అనే విషయంపై పోలీసులు సమాచారం సేకరించినట్లు తెలిసింది. వీరంతా ఉగ్రవాద సంస్థల పట్ల ఆకర్షితులుగా మారడానికి ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన సల్మాన్ ప్రారంభించిన ఫేస్‌బుక్ ఖాతా అని తెలిసినట్లు సమాచారం.
 
కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు...
జావీద్‌తో పాటు అతని తండ్రి, సోదరుడికి బెంగళూరు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఉగ్రవాదంలో చేరడం వల్ల కలిగే అనర్థాలు, చేరిన తర్వాత పరిస్థితుల గురించి అక్కడి కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీసులు వివరించినట్లు సమాచారం.అలాగే వారి పాస్ పోర్టులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులకు తప్పక సహకరించాలని కూడా వారికి చెప్పినట్లు సమాచారం. జావీద్‌ను ఒకటి రెండు రోజుల్లో కుటుంబ సభ్యులు ఖమ్మం తీసుకువస్తున్నట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు