‘అప్గ్రేడ్’ పోస్టులపై చిక్కుముడి!

22 Oct, 2016 02:24 IST|Sakshi
‘అప్గ్రేడ్’ పోస్టులపై చిక్కుముడి!

ఆ పోస్టుల్లో ఎస్జీటీలకు అవకాశమివ్వద్దంటున్న పండిట్‌లు
జీవో నంబర్లు 11, 12లను సవరించాలని డిమాండ్
నిబంధనల ప్రకారం తమను నియమించాలంటున్న ఎస్జీటీలు

సాక్షి, హైదరాబాద్: ఉన్నత పాఠశాలల్లో భాషా పండిత పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మరో చిక్కుముడి పడుతోంది. విద్యాహక్కు చట్టం నేపథ్యంలో కొన్నేళ్ల కింద జారీ అయిన జీవో నంబర్ 11, 12లతో కొత్త సమస్య తెరపైకి వస్తోంది. అప్‌గ్రేడ్ అయ్యే పోస్టుల్లో అర్హతలు కలిగిన భాషా పండితులనే నియమిస్తారా.. లేక పండిత శిక్షణ కోర్సుతో సంబంధం లేకుండా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)గా నియమితులై బీఈడీ, సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసినవారినీ నియమిస్తుందా అన్నది చర్చనీయాంశమైంది.

 విద్యా హక్కు చట్టం ప్రకారం ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) కేడర్ ఉపాధ్యాయులు.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) పనిచేయాలి. అయితే భాషా పండితుల్లో గ్రేడ్-1, గ్రేడ్-2 అనే రెండు రకాల పోస్టులు ఉన్నాయి. పీజీ కలిగిన పండిట్‌లకు గ్రేడ్-1, భాషా పండిత కోర్సులు మాత్రమే చేసినవారికి గ్రేడ్-2 పండిట్ హోదా ఇచ్చారు. గ్రేడ్-1 పండిట్‌ను ఎస్‌ఏ హోదాతో సమానంగా పరిగణిస్తారు. వారికి కొన్నేళ్ల కిందే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ (ఎస్‌ఏఎల్) హోదా కూడా ఇచ్చారు. గ్రేట్-2 పండితులు ఉన్నత పాఠశాలల్లో బోధిస్తున్నా వారికి ఎస్‌ఏ హోదా లేదు.

అయితే విద్యా హక్కు చట్టం నేపథ్యంలో గ్రేడ్-2 పండిట్ పోస్టులను కూడా ‘స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్’ హోదా గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ కలిగిన వారిని స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్‌గా మార్చుతామంటూ ఉత్తర్వులు జారీచేసింది. అంటే ఎస్జీటీగా నియమితులైనా కూడా సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉంటే.. వారికి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ పోస్టులోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో గ్రేడ్-2 భాషా పండిత ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది.

తొలి నుంచీ డిమాండ్..
ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న దాదాపు 6 వేల మంది గ్రేడ్-2 భాషా (తెలుగు, ఉర్దూ, హిందీ) పండితులు.. అప్‌గ్రేడ్ చేసే పోస్టుల్లో పండిత శిక్షణ కోర్సుతో పాటు సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన వారిని నియమించాలని తొలి నుంచీ డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం జీవో 11, 12లను సవరించాలని కోరుతున్నారు. ఆ జీవోలను సవరిస్తేనే భాషా పండితులకు న్యాయం జరుగుతుందని పీఆర్టీయూ-తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, రాష్ట్రీయ పండిత  పరిషత్తు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్లా, జగదీశ్‌లు పేర్కొన్నారు. ఎస్జీటీలకు అవకాశమిస్తే భాషా పండితులకు అన్యాయం జరుగుతుందన్నారు. మరోవైపు ప్రస్తుత నిబంధనల ప్రకారం సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన తమకు ఎస్‌ఏఎల్‌గా అవకాశమివ్వాల్సిందేనని ఎస్జీటీలు డిమాండ్ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు