బీసీ ఫెడరేషన్లలో అయోమయం 

26 Aug, 2018 02:09 IST|Sakshi

వార్షిక ప్రణాళికలను ఆమోదించని ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన కులాల (బీసీ) ఫెడరేషన్లలో అయోమయం నెలకొంది. 2018–19 వార్షిక సంవత్సరానికి దాదాపు రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ.. వాటిని ఎలా ఖర్చు చేయాలనే అంశంపై స్పష్టత కొరవడింది. మూడేళ్ల తర్వాత ఫెడరేషన్లకు సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ నేపథ్యంలో అధికారులు నూతనోత్సాహంతో పథకాల అమలుకు చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ.. భారీ స్థాయిలో వార్షిక ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. దరఖాస్తుల స్వీకరణ సైతం ఏప్రిల్‌ నెలాఖరుతో ముగిసింది.

11 ఫెడరేషన్లకు 2.21 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు స్వీకరణ పూర్తయి మూడున్నర నెలలు కావస్తున్నా అర్హుల ఎంపిక మాత్రం జరగలేదు. వాస్తవానికి ఫెడరేషన్లకు సంబంధించిన వార్షిక ప్రణాళిక ఖరారైతేనే జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్ణయించే వీలుంటుంది. ఈ క్రమంలో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ 2018–19 వార్షిక సంవత్సరం ప్రారంభమై రెండో త్రైమాసికం ముగుస్తున్నా ఫెడరేషన్ల వార్షిక ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం తెలుపలేదు. దీంతో లబ్ధి దారుల ఎంపిక ఎక్కడికక్కడే నిలిచిపోయింది. 

పరిశీలనతో సరి.. 
బీసీ ఫెడరేషన్ల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రాథమిక కసరత్తులో భాగంగా అధికారులు పరిశీలించారు. ఇందులో భాగంగా దరఖాస్తులను పూరించిన మేరకు స్వయం ఉపాధి యూనిట్‌ బడ్జెట్‌ స్థాయిని బట్టి కేటగిరీల వారీగా విభజించారు. అయితే వివిధ ఫెడరేషన్లను నిర్ణయించిన బడ్జెట్‌లో ఏయే యూనిట్లకు అనుమతి ఇవ్వొచ్చనే అంశంపై స్పష్టత వస్తేనే కేటగిరీల వారీగా లబ్ధిదారులను గుర్తించవచ్చు. కానీ వార్షిక ప్రణాళికలకు ప్రభుత్వ ఆమోదం రాకపోవడంతో అధికారులు దరఖాస్తుల పరిశీలనకే పరిమితమయ్యారు.

మరిన్ని వార్తలు