ఎంపిక చేశాక.. పథకమే లేదన్నారు!

12 Apr, 2018 01:29 IST|Sakshi

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో గందరగోళం

17 పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసిన పరిషత్‌

మూడు పథకాలకే సర్కారు ఆమోదం పాలకమండలిలోనూ అయోమయం

సీఎంను కలసి మాట్లాడాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌:  నిన్నటి వరకు..: రూ. వంద కోట్ల నిధులు.. 17 రకాల పథకాలు.. వరుసగా పాలకమండలి సమావేశాలు.. లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ.. అర్హుల ఎంపిక, రుణాల మంజూరు కసరత్తు.. 
ఇప్పుడు..: కేవలం మూడు పథకాలకే ప్రభుత్వ ఆమోదం... మిగతా పథకాలు మాయం.. ఎంపికైన లబ్ధిదారుల్లో ఆందోళన.. పనికి రాకుండా పోయిన కేటాయింపు పత్రాలు, మంజూరు పత్రాలు.. 
... ఇది బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ దుస్థితి. నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు మేలు చేసేందుకు రూ.100 కోట్ల బడ్జెట్, 17 రకాల పథకాలను ప్రకటించినా ఆచరణలోకి మాత్రం రాలేదు. ఆయా పథకాలకు లబ్ధిదారులుగా ఎంపికైన పేద బ్రాహ్మణ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 

అర్హులను ఎంపిక చేసినా.. 
పేద బ్రాహ్మణులను ఆదుకోవడానికి ప్రభు త్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో 17 పథకాలకు రూపకల్పన చేసింది. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు యూనిట్ల స్థాపనకు రుణాలు, విదేశాల్లో పేద విద్యార్థులకు విద్యా రుణాలు, వేద పాఠశాలల ఏర్పాటుకు ఆర్థిక సాయం తదితర అంశాలకు సంబం« దించి భారీగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన పరిషత్‌.. అర్హులను ఎంపిక చేసి, మంజూరు పత్రాలను జారీ చేసింది. దీనికి సంబంధించి రూ.2 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి. కానీ తర్వాత వెలువడిన జీవో నం.584తో గందరగోళం మొదలైంది. వివేకానంద విదేశీ విద్యా పథకం, రామానుజ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం, వేద పాఠశాలలకు ఆర్థిక సాయం పథకాలకు మాత్రమే ఆమోదం ఉందని అందులో తెలిపారు. దాంతో మిగతా పథకాలను తొలగించినట్టేనని వార్తలు వెలువడటంతో.. అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. పేద బ్రాహ్మణ కుటుంబాల్లోని ఔత్సాహికులకు పారిశ్రామిక రుణాలు అందించే ‘బ్రాహ్మ ణ ఎంట్రప్రెన్యూర్స్‌ డెవలప్‌మెంట్‌ స్కీం (బెస్ట్‌)’ కింద రుణాల కోసం ఎదురుచూస్తున్నవారు షాకయ్యారు. బెస్ట్‌ కింద తొలివిడతగా 155 మందిని ఎంపిక చేయగా.. కొందరు ఇప్పటికే ప్రైవేటుగా అప్పులు తెచ్చి యూనిట్ల ఏర్పాటు పనులు ప్రారంభించుకున్నారు. ఇప్పుడు రుణాలందకుంటే తమ పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఆర్థికశాఖ ఆమోదించనందునే.. 
సీఎం ఆమోదం మేరకే 17 పథకాలకు రూపకల్పన చేసినా మూడింటికే ఆమోదం రావటమేమిటని పాలకమండలి ఆరా తీయగా.. వాటిని ఆర్థిక శాఖ ఆమోదించలేదనే సమాచారం తెలియడంతో సీఎంను కలవాలని నిర్ణయించారు. ఈ మేరకు పరిషత్‌ పాలకమండలి సభ్యులు వేణుగోపాలాచారి, కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, పురాణం సతీశ్‌లకు బాధ్యత అప్పగించారు. 

పథకాలన్నీ పునరుద్ధరిస్తాం 
పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం పరిషత్‌ ఏర్పడి తదనుగుణంగానే పథకాలకు రూపకల్పన చేసింది. కానీ ఆర్థిక శాఖ నుంచి యథాలాపంగా వెళ్లిన ఓ ఫైలు వల్ల ఈ అయోమయం ఏర్పడింది. త్వరలోనే సీఎంతో చర్చించి పథకాలన్నీ అమలయ్యేలా చూస్తాం..  
 – రమణాచారి, బ్రాహ్మణ పరిషత్‌ చైర్మన్‌ 

మరిన్ని వార్తలు