కౌన్సెలింగ్‌లో గందరగోళం

1 Aug, 2015 03:15 IST|Sakshi

జీవో 3పై రగిలిన వివాదం
రెండు వర్గాలుగా ఉపాధ్యాయులు
వేర్వేరుగా ఆందోళనలు
టవరెక్కిన ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కౌన్సెలింగ్ తాత్కాలిక వాయిదా
 
 ఉట్నూర్ : ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కౌన్సెలింగ్‌లో జీవో నంబర్ 3 వివాదం రాజుకుంది. దీంతో ఉపాధ్యాయులంతా రెండు వర్గాలుగా విడిపోయారు. చివరికి   శుక్రవారం జరగాల్సిన పీజీ హెచ్‌ఎంల పదోన్నతుల కౌన్సెలింగ్‌ను ఐటీడీఏ పీవో కర్ణన్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా వాయిదా వేశారు. వివరాలివి.. ప్రభుత్వం ఆదేశాలతో ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు పీజీ హెచ్‌ఎంల బదిలీలు నిర్వహించగా.. రెండో రోజు శుక్రవారం స్కూల్ అసిస్టెంట్లకు పీజీ హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించేందుకు కౌన్సెలింగ్ చేపట్టింది.

అయితే.. కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనక యాదవ్‌రావ్ 342 ఆర్టికల్ జీవో 3 ప్రకారం 1950కి ముందు నుంచి ఉన్న షెడ్యూల్ తెగలకు చెందిన వారికే పదోన్నతులు కల్పించాలని డి మాండ్ చేస్తూ మండలంలోని లక్కారం గ్రామం లో సెల్ టవర్ ఎక్కాడు. దీంతో ఐటీడీఏ ఏపీవో జనరల్ నాగోరావ్, డీడీటీడబ్ల్యూ సావిత్రి, ఆర్డీవో ఐలయ్య అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ ఉద్యోగ, ఉపాధ్యాయ, ఇతర సంఘాల నాయకులు మాట్లాడుతూ.. 342 ఆర్టీకల్ ప్రకారం పదోన్నతులు కల్పించాలని, 1976లో ఎస్టీల్లో చేర్చిన వర్గాలకు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం 1976లో కొన్ని వర్గాలను ఎస్టీల్లో చేర్చినా.. కేంద్ర ప్రభుత్వం దానికి చట్టబద్ధత కల్పించలేదని ఆరోపించారు. జిల్లాలో 2000 సంవత్సరం నుంచి వారికే 92 శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయని, తమకు 8 శాతం మాత్రమే దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డీడీటీడబ్ల్యూ సావిత్రి స్పందిస్తూ.. ప్రభుత్వం నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని కలెక్టర్, ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐటీడీఏ పీవో ఆదేశాలతో కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా వాయితా వేస్తున్నట్లు ప్రకటించారు.

 కౌన్సెలింగ్ వాయిదా వేయడం తగదు..
 ఇదిలా ఉంటే.. ఉపాధ్యాయ పదోన్నతి కౌన్సెలింగ్‌ను అధికారులు తాత్కాలికంగా వాయిదా వేయడం తగదని కౌన్సెలింగ్‌కు హాజరైన ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. కేబీ ప్రాంగణంలో ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధం లేని వారు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తే అధికారులు కౌన్సెలింగ్ వాయిదా వేయడం సరికాదన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చామని, అధికారులు వెంటనే కౌన్సెలింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. 1976లో ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చిన వర్గాలన్నింటికీ గిరిజన చట్టాలన్నీ వర్తిస్తాయని చెప్పారు. సాయంత్రం వరకు ఆందోళన చేసిన వారు చివరికి విరమించి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు