వాహన రిజిస్ట్రేషన్లపై గందరగోళం

21 Jun, 2014 03:32 IST|Sakshi
వాహన రిజిస్ట్రేషన్లపై గందరగోళం

ఆదిలాబాద్ క్రైం : తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జిల్లాల వారీగా కోడ్ నంబర్లు కేటాయించడంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మూడు రోజులుగా జిల్లాలో కొత్త రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఏపీ సిరీస్ టీఎస్ సిరీస్‌గా మారడంతో పాత వాహనదారులు అయోమయంలో పడ్డారు. టీఎస్ సిరీస్‌తో కొత్త రిజిస్ట్రేషన్లు సజావుగానే సాగుతున్నా పాత వాహనాల విషయంలోనే ఇంక స్పష్టత రాలేదు. ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలను టీఎస్ సిరీస్‌తో మార్పు చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీనికి నాలుగు నెలలు మాత్రమే గడువు ఇచ్చింది.
 
స్పష్టమైన విధివిధానాలేవి?
పాత వాహనాల ఏపీ సిరీస్‌ను టీఎస్ సిరీస్‌లోకి మార్చుకోవాలని ప్రభుత్వం ప్రకటించినా దీనిపై స్పష్టమైన విధి విధానాలు అందకపోవడంతో రవాణా శాఖ కార్యాలయంలో గందరగోళం నెలకొంది. పాత వాహనాలన్నింటినీ నాలుగు నెలల్లోగా కొత్త సిరీస్‌లోకి మార్చుకునేందుకు గడువు ఇచ్చారు. పాత వాహనాల నంబర్ల మార్పు విషయంలో రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందా.. నంబర్ ప్లేట్ మారితే కొత్త ఆర్‌సీ బుక్కుకు రుసుము ఉంటుందా.. నంబరు ప్లేటు మార్చుకొని కొత్త నంబరు ప్లేటు తీసుకుంటే అయ్యే ఖర్చు ఎవరు భరించాలి..? అనే విషయాలపై అధికారులకు ఇంక స్పష్ట మైన ఆదేశాలు రాలేదు. దీంతో పాత వాహనాల నంబర్లు మార్చుకునేందుకు వస్తున్న వాహనదారులు నిరాశగా వెనుదిరగాల్సి వస్తోంది. పాత వాహనాల నంబర్ల మార్పుపై తమకేలాంటి ఆదేశాలు అందలేదని అధికారులు చెబుతున్నారు.
 
జిల్లావ్యాప్తంగా...
జిల్లావ్యాప్తంగా మూడు రోజుల్లో సుమారు 300ల వాహనాలు కొత్తగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో ఫ్యాన్సీ నంబర్లపై 20 వాహనాలు రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రవాణా వాహనాలకు టీఎస్ 01 యూఏ 0001, రవాణేతర వాహనాలకు టీఎస్ 01 ఈఏ0001 సంఖ్యతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇక పాత వాహనాల విషయానికొస్తే జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి 1,30,016 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో ద్విచక్రవాహనాలు 95,437, ఆటోరిక్షాలు 7,780, గూడ్స్ క్యారేజ్‌లు 5,203, కార్లు 4,864, మోపెడ్లు 3, 714, ట్రాక్టర్లు(ప్రైవేట్ )2,554, ట్రాక్టర్లు కమర్షియల్ 2,134, జీపులు 575, మోటర్ క్యాబ్‌లు 1189 ఉన్నాయి.
 
వీటి రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం ఏపీ 01 సిరీస్ కోడ్‌పై కొనసాగుతుండగా, నాలుగు నెలల్లో టీఎస్‌గా మార్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. వాహనాల నంబ ర్లు కూడా మారుతుందనే ప్రచారం జరగడంతో వాహనదారులు అయోమయంలో పడ్డారు. కొత్త రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచకపోవడంతో ప్రసుత్తం పాత వాహనాల చార్జీలతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు రూ.400, కారులకు రూ. 625, మోటర్ క్యాబ్‌లకు రూ. 860, హెవీ గూడ్స్‌లకు రూ.1,360 చొప్పున రవాణా శాఖ అధికారులు రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో ప్రతి నెల రిజిస్ట్రేషన్లతో రూ.20 లక్షల ఆదాయం సహకూరుతోంది.

మరిన్ని వార్తలు