అర్చకుల వేతన సవరణలో గందరగోళం

2 Dec, 2017 02:08 IST|Sakshi
శుక్రవారం హైదరాబాద్‌లో ఆలయ అర్చక, ఉద్యోగ ప్రతినిధులకు చెక్కు అందజేస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి. చిత్రంలో రమణాచారి తదితరులు

     ఉదయం చెక్కు అందజేసిన మంత్రి ఇంద్రకరణ్‌

     ఆయనను ఘనంగా సన్మానించిన అర్చక, ఆలయ ఉద్యోగ ప్రతినిధులు 

     ఆ తర్వాత అసలు విషయం తెలిసి భారీ ఎత్తున ధర్నా

     సీఎం హామీకి వ్యతిరేకంగా అధికారులు కుట్ర పన్నారని ఆరోపణ

     సోమవారం చర్చలకు హామీ రావడంతో తాత్కాలిక విరమణ

సాక్షి, హైదరాబాద్‌: దేవాలయ ఉద్యోగులు, అర్చకుల వేతన సవరణ వ్యవహారం గందరగోళంగా మారింది. ప్రభుత్వం ముందు ప్రకటించినట్టుగా కాకుండా అమలు వేరే రకంగా ఉందంటూ అర్చక, ఉద్యోగులు శుక్రవారం రాత్రి వరకు దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మధ్యాహ్నం అదే కార్యాలయంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారిలను సన్మానించిన ఆ ప్రతినిధులు.. తర్వాత వాస్తవం తెలిసి అదే కార్యాలయం ముందు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మేలు చేసేలా వ్యవహరిస్తే, అధికారులు మాత్రం ఆయన హామీకి విరుద్ధంగా తమకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆందోళన ప్రారంభించారు.  

అధికారులకే అస్పష్టత...! 
దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతన సవరణకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీర్ఘకాలంగా దేవాలయ అర్చక, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడంతో ముఖ్యమంత్రి స్పందించారు. ఈ మేరకు చట్టసవరణ జరిగి డిసెంబర్‌ 1 నుంచే కొత్త వేతనాలను చెల్లించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఇంతకాలం ఏ ఆలయంలో ఉద్యోగులు, అర్చకులకు ఆ ఆలయ ఆదాయం నుంచే వేతనాలు చెల్లిస్తున్నారు. అలా కాకుండా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి నేరుగా ప్రభుత్వమే ఉద్యోగులు, అర్చకుల బ్యాంకు ఖాతాలకు ఒకటో తేదీనే జమ చేసేలా, పీఆర్‌సీ అమలు చేసేలా నిర్ణయం ఉందని అంతా భావించారు. శుక్రవారం మధ్యాహ్నం చెక్కు అందజేసే కార్యక్రమానికి రావాల్సిందిగా పేర్కొనటంతో 88 మంది ప్రతినిధులు కమిషనర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారిలు ఆంధ్రాబ్యాంకు ప్రతినిధులకు చెక్కు అందజేశారు. వెంటనే ఉద్యోగులు, అర్చక ýప్రతినిధులు ఆ ఇద్దరిని సన్మానించి ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. వారు వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసి ఆగ్రహానికి గురయ్యారు. చాలా వివరాలకు అధికారుల వద్దనే స్పష్టత లేదని, అంతా గందరగోళం చేసి తమను వంచించారని వారు ఆరోపించారు 

చారిత్రక దినం.. 
దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్‌ మేరకు ఆలయ ఉద్యోగులు, అర్చకులకు వేతన సవరణ అమలు చేస్తున్నందున డిసెంబరు ఒకటి చారిత్రక దినంగా నిలిచిపోతుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అంతకుముందు వ్యాఖ్యానించారు. సీఎం తీసుకున్న సానుకూల నిర్ణయం అర్చక, ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగు నింపుతుందని రమణాచారి పేర్కొన్నారు. ఈ సవరణ మహోన్నత నిర్ణయమని తెలంగాణ అర్చక సమాఖ్య నేతలు ఉపేంద్రశర్మ, రామశర్మలు పేర్కొన్నారు.

రెండు వేల మందికే వర్తింపు
ఇప్పటి వరకు ఆలయాల నుంచి తీసుకుంటున్న వేతనాలను ఆలయాల నుంచే తీసుకోవాలని, సవరణతో పెరిగే మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం వారి ఖాతాలకు జమ చేస్తుందని అధికారులు పేర్కొనడంతో కంగుతినడం అర్చకుల వంతయింది. ఇక వేతన సవరణ అమలు కావాల్సిన 5,200 మందిలో కేవలం 2 వేల మందికే ప్రస్తుతం వర్తింపజేస్తున్నారని, మిగతావారి విషయంలో సాంకేతిక కారణాలతో తర్వాత పరిశీలిస్తామని అధికారులు చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. ఇక 2015 పీఆర్‌సీ పరిధిలో ఉన్నవారి సవరణ అంశాన్నీ పక్కన పెట్టారు. మళ్లీ దేవాలయాల నుంచి వేతనాలు పొందే విషయంలో స్థానిక కార్యనిర్వహణాధికారులు, పాలక మండళ్లతో వేధింపులు ఎదురవుతున్నాయని మొత్తుకుంటే ఇప్పుడు మళ్లీ వారి నుంచే వేతనాలు పొందాలని మెలిక పెట్టడం వెనక అధికారుల కుట్ర ఉందని అర్చక, ఉద్యోగ ప్రతినిధులు ఆరోపిస్తూ వెంటనే కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా ప్రారంభించారు. సీఎం సానుకూలంగా స్పందిస్తే అధికారులు కుట్ర చేసి ఆయన ఆలోచనను నీరుగార్చారని పేర్కొంటూ జేఏసీ నేత గంగు భానుమూర్తి ఆధ్వర్యంలో ధర్నా జరిపారు. చివరకు అదనపు కమిషనర్లు శ్రీనివాసరావు, కృష్ణవేణి సోమవారం కమిషనర్‌తో చర్చించవచ్చని పేర్కొనటంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు. 

మరిన్ని వార్తలు