వార్డుల పునర్విభజన పై గందరగోళం

5 Jul, 2019 06:36 IST|Sakshi
వినతిపత్రం ఇస్తున్న పాతపాలమూరు వాసులు

నిబంధనలు విస్మరించిన అధికార యంత్రాంగం 

ఆందోళన చెందుతున్న ఆశావహులు, స్థానికులు  

సాక్షి, పాలమూరు: మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన తీరుపై ప్రజలు, నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 2న విడుదలైన ముసాయిదా జాబితా సరిగాలేదని ఇప్పటికే చాలామంది అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు ఆటంకంగా మారే పరిస్థితులను వివరిస్తున్నారు. సరిహద్దులు నిర్ణయించడంలో పొరపాటు చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార యంత్రాంగం చేసిన హడావుడితో జాబితా గజిబిజిగా తయారైంది. ఇష్టారీతిన వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టడంతో సవరించాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఒకే క్రమ సంఖ్య ఇంటి నంబర్లను రెండు వార్డుల్లో కలపడంతో అవి ఏ కాలనీలకు వస్తాయో తెలియక స్థానికులు, పోటీ చేయాల్సిన ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ ప్రక్రియ చేపట్టకపోవడం కారణంగానే సమస్యలు తలెత్తినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

49కి చేరిన వార్డుల సంఖ్య 
మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఇదివరకు ఉన్న 41 వార్డులను పునర్విభజన చేస్తూ 49 వార్డులకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూన్‌ 22 నుంచి 30 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల కులగణన చేపట్టారు. ఇది పూర్తయిన రోజు నుంచే వార్డుల పునర్విభజన చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఈనెల 2న జాబితా వెల్లడించాలని స్పష్టం చేయడంతో అధికారులు మున్సిపాలిటీ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, బిల్‌కలెక్టర్లకు బాధ్యతను అప్పగించారు. వీరు క్షేత్రస్థాయి కాలనీల్లో పర్యటించి వార్డుల వారీగా హద్దులు నిర్ణయించడం, ఓటర్ల వారీగా పునర్విభజన చేపట్టాల్సి ఉంటుంది.

శాశ్వత నిర్మాణాలైన రోడ్లు, రైల్వేపట్టాలు, చెరువులు తదితర వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విభజన ప్రక్రియ సందర్భంగా ఇవి అడ్డుగా వస్తే అక్కడికే నిలిపివేయాల్సి ఉంటుంది. 2200 నుంచి 2700 వరకు ఒక వార్డుగా విభజించినప్పటికీ నిబంధనలు మాత్రం పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక వార్డులో ఓటర్లను కలపాల్సి వస్తే సమీపంలో ఉన్నవాటినే పరిగణనలోకి తీసుకోవాలి. కానీ వాటికి దూరంగా ఉన్న వాటిని కలిపేశారు. అధికారులు కార్యాలయంలో ముందుగా రూపొందించిన మ్యాప్‌లను పరిశీలించడం, ఇంటి నెంబర్ల వారీగా ఓటరు జాబితాలను తీసుకొపి వార్డులను ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో కచ్చితంగా పూర్తి చేయాలని ప్రభుత్వం చెప్పడంతో హడావుడిగా ఈ ప్రక్రియ చేపట్టారు. ఫలితంగా జాబితా గజిబిజిగా మారేందుకు కారణమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు 
వార్డుల పునర్విభజన ప్రక్రియ గందరగోళంగా మారడంతో ప్రజలతో పాటు ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో ఇలా ఉండటం మూలంగా పూర్తి గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆయా కాలనీవాసులకు కూడా తాము ఏ వార్డు పరిధిలోకి వస్తామో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ వార్డుల విభజన ప్రక్రియ గందరగోళంగా ఉందని అధికార యంత్రాంగం తప్పిదాలను ఎత్తిచూపుతూ పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. రాజకీయ పార్టీలతో పాటు పలువురు పట్టణవాసులు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారు పునర్విభజన ప్రక్రియపై ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటి వరకు 21ఫిర్యాదులు వచ్చాయి.  అధికంగా పూజరితండా, పాత పాలమూరు, అప్పన్నపల్లి, పద్మవతికాలనీ, టిడిగుట్ట, షాషాబ్‌గుట్ట, పాలకొండ తదితర వార్డులు నుంచి అధికంగా వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 13వ వార్డు పాత పాలమూరును విభజించి 16వ వార్డుగా, 23వ వార్డుగా ఏర్పాటు చేశారు. దాంట్లో పాత 13వ వార్డులో ఉన్న ఇంటి నెంబర్లు 5–10–1 నుంచి 5–10– 61/2 వరకు పాత పాలమూరుకు దూరంగా ఉన్న బండమీదిపల్లి, హన్మన్‌పుర వార్డుకు కలిపారు. అదేవిధంగా 5–10, 5–11, 5–12 బ్లాక్‌లతో పాటు పాత, కొత్త బాలాజీ నగర్‌ కలిపి 16వ వార్డుగా ఏర్పాటు చేయాలని గురువారం స్థానికులు మున్సిపల్‌ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.

అలాగే మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డు చిన్నదర్పల్లి పరిధిలో ఉన్న పూజారితండాను తొలగిస్తూ 33వ వార్డులో కలుపుతున్నారని, ఆ తండాను గతంలో ఉన్న 34వ వార్డులోనే ఉండేవిధంగా చూడాలని మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ కమిషనర్‌ సురేందర్‌కు ఆ వార్డుకు యువకులు వినతి పత్రం ఇచ్చారు. నిబంధనల ప్రకారం వార్డుల పునర్విభజన ఆయా వార్డుల సరిహద్దులను గుర్తిస్తూ ఓటర్లు, ఇంటి నంబర్ల ఆధారంగా విభజనచేయాల్సి ఉంటుంది. అయితే వార్డుల విభజన పూర్తిగా ఇంటి నంబర్ల ఆధారంగా చేపట్టడంతో భారీగా ఓటర్లు కన్పించకుండా పోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తాం 
వార్డుల విభజనపై అభ్యంతరాలు చెప్పడానికి శుక్రవారం వరకు సమయం ఉంది. ఆ తర్వాత వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పర్యటన చేస్తాం. స్థానికంగా ఉండే సమస్యలను అన్నింటిని దృష్టిలో పెట్టుకొని పరిశీలన చేస్తాం. ఓటర్లు, ఇంటి నెంబర్లు ఎవైనా తప్పుగా ఉంటే అభ్యంతరాలు చెప్పవచ్చు. 
–సురేందర్, కమిషనర్‌      

మరిన్ని వార్తలు