54 మందికి రైట్‌ రైట్‌

31 Oct, 2018 02:39 IST|Sakshi

కాంగ్రెస్‌ తొలి జాబితా దాదాపు సిద్ధం.. ప్రకటన తేదీపైనే సందిగ్ధత

నవంబర్‌ 1 లేదా 7న ప్రకటన.. పూర్తి జాబితాతో ఢిల్లీకి భక్తచరణ్‌దాస్‌ కమిటీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. రాష్ట్రంలోని 54 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులతో కూడిన తొలి జాబితా సిద్ధమైంది. గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు... టీపీసీసీ ముఖ్య నేతలు, ఆశావహులతో చర్చించి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తయారు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అందులో 54 మందితో సిద్ధమైన అభ్యర్థుల జాబితాను తొలి విడతగా ప్రకటించే అవకాశాలున్నాయి.

అయితే ఈ ప్రకటన ఎప్పుడనే దానిపై కొంత సందిగ్ధత నెలకొంది. నవంబర్‌ 1న తొలి జాబితా ప్రకటిస్తామని ఇటీవల కుంతియా, ఉత్తమ్‌ బహిరంగంగానే ప్రకటించినప్పటికీ 2వ తేదీన ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం ఉందని, ఆ సమావేశంలో జాబితాను నిర్ధారించి రాహుల్‌ ఆమోదముద్ర వేశాకే దాన్ని విడుదల చేస్తారనే చర్చ కూడా గాంధీ భవన్‌ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ వెళ్లిన స్క్రీనింగ్‌ కమిటీ బుధవారం రాహుల్‌ వద్దకు జాబితా పంపితే గురువారం ఫస్ట్‌ లిస్ట్‌ వస్తుందని, లేదంటే 7వ తేదీలోగా ఎప్పుడైనా వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను మరో రెండు విడతల్లో ప్రకటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ముందు లేదా ఆ తర్వాత ఈ జాబితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు