తక్షణమే ఎన్నారై పాలసీ ప్రకటించాలి: కాంగ్రెస్‌

23 Aug, 2017 14:28 IST|Sakshi
హైదరాబాద్‌: గల్ఫ్ ఎన్నారైల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ స్పీకర్‌ సురేష్ రెడ్డి, టీ కాంగ్రెస్‌ ఎన్నారై సెల్‌ చైర్మన్‌ వినోద్‌లు ఆరోపించారు. మీడియాతో వారు మాట్లాడుతూ గత ఏడాది జూలైలో ఎన్నారై పాలసీ తయారు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించగా ఎన్నారై ప్రతినిధులు సలహాలు, సూచనలు ఇచ్చారని, అయితే ఇంత వరకు ఆ పాలసీని అమలు చేయడం లేదన్నారు. మూడేళ్లలో 600 మంది గల్ఫ్‌లో చనిపోగా ప్రభుత్వం ఒక్క పైసా సాయం చెయ్యలేదని, అక్కడ జైళ్లలో ఉన్న మనవారికి న్యాయ సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
అనారోగ్యంతో ఉన్నవారికి సహాయంగా ఎవరైనా వెళితే వంద రియాజ్‌లు పన్ను కట్టాల్సి వస్తోందన్నారు. గల్ఫ్ ఎన్నారైల నుంచి మన ప్రభుత్వానికి నెలకు రూ. 50 కోట్లు పన్ను రూపంలో వస్తోందని వివరించారు. ప్రభుత్వం తక్షణం పాలసీ ప్రకటించాలని, గత మూడేళ్లలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వారి సమస్యలపై అసెంబ్లీలో చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతుందని సురేష్‌రెడ్డి, వినోద్‌లు తెలిపారు.
మరిన్ని వార్తలు