బస్తీలో ‘కొత్త దోస్తీ’

28 Jan, 2020 02:00 IST|Sakshi

బీజేపీ–టీఆర్‌ఎస్‌.. బీజేపీ–కాంగ్రెస్‌ల దోస్తానా

పురపీఠాల కోసం చేతులు కలిపిన వైరి పక్షాలు

మణికొండలో కాంగ్రెస్‌ చైర్మన్, బీజేపీ వైస్‌చైర్మన్‌

నల్లగొండలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ ‘సాయం’

ఎంఐఎం మద్దతుతో ఇందూరులో టీఆర్‌ఎస్‌ పాగా

చౌటుప్పల్‌లో టీఆర్‌ఎస్‌–సీపీఎం అవగాహన  

సాక్షి, హైదరాబాద్‌ : పురపోరులో కొత్త పొత్తులు పొడిచాయి. ఎన్నికల్లో విమర్శలు, సవాళ్లతో కత్తులు దూసుకున్న పార్టీలు చైర్మన్, వైస్‌చైర్మన్‌ పదవులు పంచుకోవడానికి ఒక్కటయ్యాయి. నంబర్‌గేమ్‌లో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు.. వైరిపక్షాలతో జతకట్టాయి. ఆధ్యంతం రసవత్తరంగా సాగిన పురపోరులో చివరి ఘట్టం మరింత ఆసక్తిరేకెత్తించింది. ప్రచారపర్వంలో ‘బస్తీ మే సవాల్‌’అంటూ పదునైన విమర్శనాస్త్రాలు సంధించుకున్న వైరిపక్షాలు.. సంఖ్యాబలంలో వెనకబడటమే తరువాయి పొత్తులకు శ్రీకారం చుట్టాయి. ఫలితాలు వెలువడిన 48గంటల్లోనే కొత్త మిత్రులతో కలసి పురపగ్గాలు చేపట్టాయి. 

  • నిజామాబాద్‌ నగర పాలక సంస్థలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లభించకపోవడంతో టీఆర్‌ఎస్‌–మజ్లిస్‌లు చేతులు కలిపాయి. మేయర్‌ పోస్టును ఎగురేసుకుపోయాయి. టీఆర్‌ఎస్‌కు ఎంఐఎంతోపాటు కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లు కూడా మద్దతు పలికారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మద్దతుతో డిప్యూటీ మేయర్‌ పదవిని ఎంఐఎం కైవసం చేసుకుంది.
  • సంగారెడ్డి పురపాలికలో ఇద్దరు మజ్లిస్‌ కౌన్సిలర్లు అండగా నిలవడంతో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు గులాబీపరమయ్యాయి.
  • పిట్టల పోరు పిల్లి తీర్చినట్లు అధికారపార్టీలో నెలకొన్న ముసలం ప్రత్యర్థి పార్టీకి కలిసొచ్చింది. బొల్లారం మున్సిపాలిటీలో గ్రూపు తగాదాల కారణంగా టీఆర్‌ఎస్‌లోని ఒక వర్గం కాంగ్రెస్‌తో జతకట్టింది. దీంతో చైర్మన్‌ టీఆర్‌ఎస్, వైస్‌ చైర్మన్‌ కాంగ్రెస్‌కు దక్కాయి.
  • మణికొండలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాలేదు. మొత్తం 20 వార్డుల్లో కాంగ్రెస్‌ 8, బీజేపీ 6, టీఆర్‌ఎస్‌ 5, ఒక స్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలుపొందారు. ఎన్నికల ముందు విపక్షాలుగా సవాళ్లు విసురుకున్న బీజేపీ–కాంగ్రెస్‌ ఫలితాల అనంతర మిత్రపక్షాలుగా మారిపోయాయి. ఇరు పార్టీలు ఒప్పందం కుదుర్చుకుని కాంగ్రెస్‌ చైర్మన్, బీజేపీ వైస్‌ చైర్మన్‌ పోస్టులు పంచుకున్నాయి.
  • అమరచింతలో అధికార పార్టీతో కామ్రేడ్లు దోస్తీ కట్టారు. చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు సహకరించిన సీపీఎం.. వైస్‌ చైర్మన్‌ పోస్టును తమ ఖాతాలో వేసుకుంది.
  • తిరుగుబాటు అభ్యర్థులు దారికి రావడంతో అయిజ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడింది. ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ తరఫున బరిలో దిగి గెలిచిన 10 మంది అభ్యర్థులు, టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారు. 16 మంది సంఖ్యాబలంతో పురపాలికను కైవసం చేసుకున్నారు. 
  • మక్తల్‌లో కాంగ్రెస్‌ సహకారంతో బీజేపీ చైర్మన్‌ కుర్చీని దక్కించుకుంది. టీఆర్‌ఎస్‌కు అధికారాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో కమలానికి దగ్గరైన కాంగ్రెస్‌కు బీజేపీ నుంచి ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. వైస్‌ చైర్మన్‌కు మద్దతు పలకకుండా ముఖం చాటేసింది.
  • చౌటుప్పల్‌ మున్సిపల్‌ పీఠం కోసం కాంగ్రెస్, సీపీఎంలు ఎన్నికల్లో కలసి పోటీ చేశాయి. అయితే, చైర్మన్‌ ఎన్నిక విషయంలో మాత్రం సీపీఎం ప్లేటు ఫిరాయించడంతో టీఆర్‌ఎస్‌కు చైర్మన్, సీపీఎంకు వైస్‌చైర్మన్‌ పీఠం దక్కాయి. 
  • నల్లగొండ మున్సిపాలిటీ విషయానికి వస్తే అక్కడ టీఆర్‌ఎస్‌ ఎక్స్‌అఫీషియో బలంతో పురపీఠాన్ని దక్కించుకుంది. కానీ, కాంగ్రెస్, బీజేపీలు కలిస్తే ఇబ్బంది అవుతుందేమో అనే ఆలోచనతో ముందు బీజేపీకి వైస్‌చైర్మన్‌ పదవిని ఆశగా చూపింది. దీంతో బీజేపీ సభ్యులు చైర్మన్‌ ఎన్నికలో తటస్థంగా వ్యవహరించారు. కానీ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక విషయానికి వచ్చేసరికి బీజేపీకి దక్కలేదు. ఎన్నిక నేటికి వాయిదా పడింది. మంగళవారం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నీలగిరిలో నెలకొంది. 
  • బడంగ్‌పేట మున్సిపాలిటీలో ఎక్స్‌అఫీషియో ఓటరుగా నమోదు చేసుకున్న ఐదుగురు టీఆర్‌ఎస్‌ సభ్యులు చివరి నిమిషంలో తుక్కుగూడకు ఆప్షన్‌ మార్చుకుని పురపీఠం దక్కించుకోవడం ద్వారా బీజేపీకి షాక్‌ ఇచ్చారు. బడంగ్‌పేటలో కాంగ్రెస్‌ సభ్యులు టీఆర్‌ఎస్‌లోకి గంపగుత్తగా వెళ్లడంతో అక్కడ ఎక్స్‌అఫీషియో సభ్యుల అవసరం టీఆర్‌ఎస్‌కు రాలేదు. 
     
మరిన్ని వార్తలు