దసరా తర్వాతే..!

16 Oct, 2018 08:02 IST|Sakshi

దసరా తర్వాత గాని మహాకూటమి అభ్యర్థుల ప్రకటనపై సస్పెన్స్‌ వీడేలా లేదు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పొత్తుల్లో భాగంగా ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయమై ఓ నిర్ణయానికి వచ్చినా.. విజయదశమి తర్వాత ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సుమారు 30 రోజుల తర్వాత కాంగ్రెస్, కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య పొత్తుల వ్యవహారంపై పలు దఫాలుగా జరిపిన చర్చల అనంతరం దాదాపుగా కొలిక్కి వచ్చిందని ఆ పార్టీ కీలక నేతలు చెప్తున్నారు. కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం (సీఎంపీ) అమలుపై కూడా ఓ నిర్ణయానికి వస్తే పొత్తులు, కూటమి పేరు, ఆయా జిల్లాల్లో కాంగ్రెస్, కూటమి పార్టీల అభ్యర్థులు పోటీ చేసే స్థానాలపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిసింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్‌ స్థానాల విషయంలో నిర్ణయానికి రావడం కోసమే ఇంత సమయం పట్టినట్లు చెప్తున్నారు. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లో జట్టుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే విషయమై జరుగుతున్న చర్చల్లో జిల్లాకు చెందిన నేతలే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏఐసీసీ, టీపీసీసీలు పొత్తులు, సర్దుబాట్ల బాధ్యతలు కె.జానారెడ్డికి అప్పగించిన్పటికీ.. అందులో కరీంనగర్‌ జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకర్‌ టీపీసీసీ వర్కింగ్‌ కమిటి ప్రెసిడెంట్‌గా కీలకంగా ఉన్నారు. అదే విధంగా తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ జగిత్యాల జిల్లాకు చెందిన వారు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న రమణ కూట మి ఏర్పాటు, సీట్ల సర్దుబాటు విషయంలో తనదైన పాత్ర పోషిస్తున్నారు. అలాగే మాజీ సీపీఐ ఎల్‌పీ నేత, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా కరీంనగర్‌ జిల్లాకు చెందిన వారే కాగా, టీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యం గా ఆయన పొత్తుల విషయంలో నిర్దిష్టంగా ఉన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా జరిగే అసెం బ్లీ స్థానాల సర్దుబాట్లు, సీట్ల కేటాయింపుల విషయంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెం దిన ముగ్గురు అగ్రనేతలు కీలకంగా వ్యవహరిస్తుండగా, ఈ జిల్లాకు స్థానాలే పీటముడి కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఆదివారం, సోమవారం ఆయా పార్టీలతో నేతలు వేర్వేరుగా జరిపిన చర్చల అనంతరం పొత్తులు ఖాయం కాగా, ఉమ్మడి జిల్లాలో పీటముడిగా మారిన స్థానాలపై కూడా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. టీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా కలిసిపోయే క్రమంలో ‘పట్టు విడుపుల’తో ముందుకు సాగాలన్న నిర్ణయంతో పార్టీలు పని చేయాలని నిర్ణయించుకున్న వారు, దసరా తర్వాత నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది.

ముగ్గురి నిర్ణయమే కీలకం..
పొత్తుల్లో భాగంగా కూటమి పార్టీలకు 20 నుంచి 24 స్థానాల వరకు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ సుముఖంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఇందులో తెలుగుదేశం పార్టీకి 10–12, టీజేఎస్‌కు 8–10 కాగా, సీపీఐకి రెండు స్థానాలు ఇచ్చేందుకు సూచనప్రాయంగా అంగీకారం జరిగినట్లు తెలిసింది. అయి తే.. ఈ కోటాలో టీజేఎస్‌ ఒక్క ఉమ్మడి కరీంనగర్‌లోనే హుజూరాబాద్, కరీంనగర్‌లలో రెండు స్థానాల ను అడుగుతున్నట్లు ప్రచారం. అదేవిధంగా ఒకటి సీపీఐ (హుస్నాబాద్‌), టీడీపీ రెండు (హుజూరాబాద్, కోరుట్ల) స్థానాలపై కన్నేసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఇచ్చే రెండు మూడు స్థానాల్లో హుస్నాబాద్‌ను ప్రథమ ప్రాధాన్యంగా అడుగుతున్నారు.

అత్యధిక పర్యాయాలు సీపీఐ ఆ స్థానం నుంచి గెలుపొందినందున హుస్నాబాద్‌ తమకే కేటాయించా లని ఆయన భీష్మించుకు కూర్చున్నారు. ఇదిలా ఉంటే మొదట హుజూరాబాద్‌ నుంచి టీడీపీ నుంచి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. ఆయన హైదరాబాద్‌లో చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పుడా స్థానంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జోజిరెడ్డి ఆడుగుతున్నారు. ఇదే సమయంలో కోరుట్ల నుంచి టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ పేరు ప్రచారంలో ఉంది.

మొత్తం ఈ ఐదు స్థానాలే కూటమి పొత్తులకు పీటముడిగా మారగా, ఎవరెవరికి ఎన్ని స్థానాలు? ఎక్కడెక్కడ కేటాయిస్తారు? ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కూటమి స్థానాలు ఎన్ని? ఆ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు? అనేది మాత్రం దసరా తర్వాతే తేలనుందని కూటమికి చెందిన ఓ కీలక నేత ‘సాక్షిప్రతినిధి’కి తెలిపారు. ఈ ఐదు స్థానాలపై పీటముడి వీడాలంటే కూటమిలో కీలకంగా ఉన్న చాడ వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎల్‌.రమణ మరింత కీలకం. కాగా దసరా పండగ తర్వాతే అభ్యర్థుల జాబితా వెల్లడి కానుండగా, అప్పటి వరకు కాంగ్రెస్, కూటమి పార్టీల ఆశావహులకు ఉత్కంఠ తప్పేటట్లు లేదు.

మరిన్ని వార్తలు