కేంద్ర పథకాల అమలుకు టీఆర్‌ఎస్‌ అడ్డు 

18 Jul, 2019 13:00 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ధర్మారావు

సాక్షి, నిజామాబాద్‌అర్బన్‌: దేశంలో కాంగ్రెస్‌ అనాథగా మారిపోయిందని, పార్లమెంట్‌లో ఆ పార్టీకి 17 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యమే లేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సభ్యత్వ నమోదు ప్రముఖ్‌ మార్తినేని ధర్మారావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు సారథ్యం వహించే వారే లేరని, 20 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులు రాజీనామాలు చేశారని తెలిపారు. బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. అనంతరం కార్యకర్తలకు శిక్షణాతరగతులు నిర్వహించారు. ధర్మారావు మాట్లాడుతూ.. బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, బీజేపీకి కేంద్రంలో రెండోసారి సంపూర్ణ మెజార్టీని ప్రజలు ఇచ్చారన్నారు. 14 కోట్ల కుటుంబాలకు కేంద్ర పథకాలు నేరుగా చేరుతున్నాయని, పైరవీకారులు, కమీషన్‌ ఏజెంట్లు ఈ ప్రభుత్వంలో లేరని చెప్పారు. అందుకే 11 రాష్ట్రాల్లో బీజేపీకి 51శాతం ఓట్లు వచ్చాయన్నారు. 

ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే.. 
దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని, ఆ పార్టీలు పలు రాష్ట్రాల్లో కుప్పకూలుతున్నాయని ధర్మారావు పేర్కొన్నారు. ప్రాంతీయ, కుల, మత, కుటుంబ పార్టీలకు కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను అమలు చేయకుండా అడ్డుకుంటుందని, అందులో పీఎం ఆవాస్‌ యోజన, ఫసల్‌ బీమా యోజన, ఆయూష్మాన్‌ భారత్‌ ఉన్నాయని తెలిపారు. 

18 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యం.. 
రాష్ట్రంలో గతంలో 18 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని, ఈసారి మరో 18 లక్షల సభ్యత్వం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ధర్మారావు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 25వేలకు తగ్గకుండా సభ్యత్వం చేపడుతున్నామని తెలిపారు.అనంతరం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్మారావును సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, బస్వా లక్ష్మీనర్సయ్య, బాల్‌రాజ్, ఎల్లప్ప, లక్ష్మీనారాయణ, అమృతలత, యెండల సుధాకర్, న్యాలం రాజు, మల్లేష్‌ యాదవ్, శివరాజ్, భరత్‌భూషణ్, స్వామి యాదవ్‌ పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు