ఇక సమరమే!

18 Jul, 2015 03:11 IST|Sakshi
ఇక సమరమే!

♦ ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ శ్రేణులు
♦ ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్‌పై ఉద్యమబాట
♦ హెచ్చరించిన మాజీ మంత్రి సబిత

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కాంగ్రెస్ కదం తొక్కుతోంది. గులాబీ దూకుడుకు కళ్లెం వేసేందుకు ఉద్యమబాట పడుతోంది. ఏడాదికాలంగా మౌనముద్ర దాల్చిన ‘హస్తం’ పార్టీ.. జనంలోకి వెళ్లడానికి ఇదే అదునైన సమయమని అంచనాకొచ్చింది. చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టు నుంచి జిల్లాను పూర్తిగా ఎత్తివేయడంపై ప్రజా ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలలోనూ జిల్లా విస్తీర్ణాన్ని కుదించడాన్ని వ్యతిరేకిస్తూ సంఘటితమవుతోంది. ఇప్పటికే ముచ్చర్ల ఫార్మాసిటీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజాసంఘాలను ఏకంచేసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. తాజాగా సాగునీటి ప్రాజెక్టుల్లో జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నాయకత్వం వహిస్తున్నారు. ఓటమి తర్వాత తొలిసారి గాంధీభవన్‌లోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయానికి వచ్చిన కాంగ్రెస్ నేతాగణం.. జిల్లాపై కేసీఆర్ సర్కారు వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.

 గజ్వేల్ కోసం జిల్లాకు అన్యాయం
 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ డాక్టర్ రాజశేఖరరెడ్డి అంకురార్పణ చేసిన చేవెళ్ల- ప్రాణహిత డిజైన్ మార్చాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సివస్తుందని సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. ప్రాజెక్టు డిజైన్‌ను మార్చడమే కాదు.. ఆఖరికి అంబేద్కర్ పేరును కూడా తొలగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం దారుణమని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలపై వివక్ష చూపుతున్న ముఖ్యమంత్రి.. గజ్వేల్ వరకు ప్రాజెక్టును పరిమితం చేయడం.. గతంలో ఐదు టీఎంసీల నీటిని కేటాయించిన గజ్వేల్‌కు.. ఇప్పుడు 50 టీఎంసీలు మళ్లించాలని చూడడం ఆయన కుట్రను తేటతె ల్లం చేస్తుందన్నారు.

చేవెళ్ల వరకు ప్రాజెక్టు సాధ్యపడదని ఏ సంస్థ చెప్పిందో... అదే సంస్థ గతంలో సాధ్యమవుతుందని నివేదిక ఇచ్చిన సంగతి మరిచిపోయారా?అని ప్రశ్నించారు. ఇప్పటికే దాదాపు రూ.600 కోట్ల మేర పనులు చేపట్టారని, అర్థంతరంగా ప్రాజెక్టు రీడిజైన్ జాతీయ హోదా కూడా అనుమానమేనని అన్నారు. అనుమతులు, నిధుల లభ్యతతో ప్రాజెక్టు ప్రారంభానికే నాలుగైదేళ్లు పట్టే అవకాశంలేకపోలేదని, కాలయాపనకే ప్రాణహిత ప్రాజెక్టును రెండు ముక్కలు చేస్తున్నట్లు కనిపిస్తోందని సబిత విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల  ప్రాజెక్టులోనూ జిల్లాకు అన్యాయమే జరిగిందని ఎమ్మెల్యే రామ్మెహన్‌రెడ్డి అన్నారు.

జూరాల నుంచి కృష్ణా జలాలను తరలిస్తే పశ్చిమ రంగారెడ్డి సస్యశ్యామలం అయ్యేదని, దివంగత వైఎస్ కూడా అదే దిశగా ఆలోచన చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటిని తీసుకురావాలనుకోవడం మూర్ఖత్వమని అన్నారు. ఇప్పటివరకు అనుమతులు, నీటి కేటాయింపుల్లేని ఈ ప్రాజెక్టుతో ప్రజలను మభ్యపెట్టాలని కేసీఆర్ సర్కారు చూస్తున్నదని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర తాగు, సాగు, పరిశ్రమల అవసరాలను తీర్చే ప్రాణహిత ప్రాజెక్టు నుంచి జిల్లా ఆయకట్టును తొలగిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్,  మాజీ ఎమ్మెల్యేలు భిక్షపతియాదవ్, కూన శ్రీశైలం గౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు ఏనుగు జంగారెడ్డి, పార్టీ నేతలు కుసుమ కుమార్, రవికుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు