‘కారు’ పనైపోయింది : జైరాం రమేష్‌

3 Dec, 2018 11:02 IST|Sakshi
ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న జైరాం రమేష్, చిత్రంలో వీహెచ్, రేవూరి 

సాక్షి, హన్మకొండ: తెలంగాణలో ‘కారు’ పనైపోయింది.. కేసీఆర్‌ ఇక ఫాం హౌస్‌కే పరిమతమవుతారని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు జైరాం రమేష్‌ అన్నారు. ఆదివారం హన్మకొం డలోని పోచమ్మకుంట, సగర కాలనీ, ప్రేమ్‌నగర్‌ కాలనీ, హనుమాన్‌ నగర్, నయింనగర్, లష్కర్‌సింగారం, రాజాజీనగర్, రాంనగర్‌లో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి ప్రజా కూటమి అభ్యర్థి రేవూరి ప్రకాష్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నయింనగర్‌లో జైరాం రమేష్‌ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా, రాహుల్‌గాంధీ ఇచ్చారని, బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన కేసీఆర్‌ కుటుంబ తెలంగాణగా మార్చారని విమర్శించారు.

ప్రజలను మాయమాటలతో మోసం చేస్తూ నాలుగున్నర ఏళ్లు పాలన సాగించాడని, కేసీఆర్‌ పతనానికి వరంగల్‌ నుంచి నాందీ పలకాలని కోరారు. సైకిల్‌ను నడపాలంటే చేయి సహకారం అవసరమని అందుకే టీడీపీకి కాంగ్రెస్‌ సహకిస్తోందని చెప్పారు. హనుమాన్‌ నగర్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు హనుమంతరావు మాట్లాడుతూ బీజేపీకి కొమ్ము కాస్తున్న కేసీఆర్‌ వరంగల్‌ అభివృద్ధిపై ఎందుకు ఒత్తిడి తేలేదని ప్రశ్నించారు. కాజీపేటలో వ్యాగన్‌ పరిశ్రమ, కోచ్‌ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్‌ కేంద్రం వచ్చిందా అని ప్రశ్నించారు. రైతులకు, దళితులు, యువకులకు కేసీఆర్‌ ఒరుగబెట్టింది ఏమీ లేదని, ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రచారం కార్యక్రమంలో మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, ప్రజాకూటమి నాయకులు బంక సంపత్‌ యాదవ్, నాయిని లక్ష్మారెడ్డితోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు