నల్గొండ: తాగునీరు అందించిన ఘనత కోమటిరెడ్డిదే

6 Dec, 2018 12:16 IST|Sakshi

  కోమటిరెడ్డి సతీమణి సబిత 

సాక్షి, నల్లగొండ రూరల్‌ : ఎంతో వెనుకబడిన నల్లగొండ ప్రాంతానికి కృష్ణా తాగునీరు అందించిన ఘనత కోమటిరెడ్డిదే అని నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సతీమణి సబితారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పలు కాలనీల్లో ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధికి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేశారని తెలిపారు. ఫ్లోరైడ్‌ రక్కసితో శారీరక వైకల్యం వస్తుండడంతో కృష్ణా తాగునీటి కోసం కోమటిరెడ్డి నిరాహార దీక్షలతో పోరాటం నిర్వహించారన్నారు. పట్టణంలో సీసీ రోడ్లు వేయించడంతోపాటు తాగునీటికోసం ట్యాంక్‌లు నిర్మించారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, నిరుద్యోగులను నిం డా ముంచారని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్, పీఆర్‌సీ ఇవ్వకుండా మాటల గారడీతో పాలన సాగించారని విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాలు చేసి కేసీఆర్‌ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారన్నారు. కోమటిరెడ్డి ఆపదలో ఉన్నవారిని అక్కున చేర్చుకున్నారని, ఎంతోమంది పేద విద్యార్థులకు మెడిసిన్‌ చదువులకు ఫీజులు కట్టడంతోపాటు ఆర్థికంగా చితికిపోయిన, ఆపదలో ఉన్నవారికి ఆర్థిక బరోసా కల్పించారన్నారు. ఈ సందర్భంగా వివిధ కాలనీల్లో భారీసంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మండల జెడ్పీటీసీ రాధ, బుర్రి మాలతి, సురెడ్డి సరస్వతి, మాధవి, విజయ, పోరెడ్డి హరిత, సుమతి, నాగమణిరెడ్డి, బాబా, ఇంతియాజ్, హుస్సేన్, అమీర్, లతీఫ్, రమేశ్‌ నేత, గణేశ్, ధర్మభిక్షం, వేమన, లవన్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తాలు...

మరిన్ని వార్తలు