పొన్నాలకు ‘మొండిచేయి’

14 Nov, 2018 10:59 IST|Sakshi

తొలిజాబితాలో దక్కని చోటు

పొత్తుల కారణంగానే సీటుపై రాని క్లారిటీ

హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన లక్ష్మయ్య

అధిష్టానం నుంచి లభించని భరోసా

సాక్షి, జనగామ: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమి టీ తొలి అధ్యక్షులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ య్యకు ఆ పార్టీ అధిష్టానం ఝలక్‌ ఇచ్చింది. కాం గ్రెస్‌ పార్టీ సోమవారం రాత్రి 65 మందితో ప్రకటించిన తొలి జాబితాలో జనగామ టికెట్‌ ఆశించి న పొన్నాలకు చుక్కెదురైంది. సీనియర్‌ నాయకుడైన పొన్నాల లక్ష్మయ్య పేరు జాబితాలో లేకపోవడంతో ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో అధిష్టానంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్‌ దక్కకపోవడంతో పొన్నాల లక్ష్మ య్య హుటాహుటిన మంగళవారం ఢిల్లీకి పయనమయ్యారు.

పొన్నాలకు టికెట్‌ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఆయన అనుచరులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు తీవ్రంగా నిరసన వ్యక్తంచేస్తున్నారు. జనగామ కాంగ్రెస్‌లో షాక్‌.. తెలంగాణ రాష్ట్రానికి తొలి టీపీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన పొన్నాల లక్ష్మయ్యకు మొదటి జాబితాలో చోటుదక్కకపోవడంతో జనగామ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. 2014 ఎన్నికల సమయంలో  టీపీసీసీ అధ్యక్షుడుగా వ్యవహరించిన పొన్నాల పోటీచేసే అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేయడంతోపాటు బీ ఫాంలను అందించారు. నాలుగున్నర ఏళ్ల తరువాత పరిస్థితులు మారిపోయాయి.

రాష్ట్ర కాంగ్రెస్‌తోపాటు జాతీయ స్థాయిలో పొన్నాలకు బలమైన బీసీ నాయకుడిగా గుర్తింపు ఉంది. ఎన్నికల్లో టికెట్‌ తప్పకుండా వస్తుందనే నమ్మకంతో ఉన్న పొన్నాలకు ఊహించని విధంగా ఆయన పేరును పక్కన పెట్టారు. ఈ అనూహ్య పరిణామం పార్టీశ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. –టికెట్‌పై లభించని క్లారిటీ.. తొలి జాబితాలో టికెట్‌ దక్కించుకోని పొన్నాల లక్ష్మయ్య వెనువెంటనే హస్తినకు పయనమైయ్యారు. టికెట్‌ రాకపోవడంపై అధిష్టానం పెద్దలను కలువడం కోసం ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో ఉండడంతో పొన్నాల ఆయన్ని కలిసే అవకాశం లేదు. మంగళవారం రోజంతా పొన్నాల టికెట్‌పై క్లారిటీ రాలేదు.

ఒకవైపు పొన్నాలకు టికెట్‌ ఇవ్వకపోవడంపై బీసీ సంఘాలు, పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ లక్ష్మయ్యకు అధిష్టానం నుంచి భరోసా లభించడం లేదు. –రాజీనామా బాటలో పార్టీ శ్రేణులు.. ఇంతకాలం పొన్నాలను నమ్ముకొని పార్టీలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు తమ పదవులతోపాటు పార్టీ సభ్యత్వాలకు రాజీమానా చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. జనగామలో పార్టీ బలోపేతంలో పొన్నాల శక్తిమేరకు కృషి చేస్తున్నారని లక్ష్మయ్య లేకుండా కాంగ్రెస్‌ పార్టీకి మనుగడ లేదని కార్యకర్తలు చెబుతున్నారు. పొన్నాలకు టికెట్‌ రాకుంటే పార్టీని వీడుతామని హెచ్చరిస్తున్నారు. రెండో జాబితాలోనైనా పొన్నాల పేరు ఉంటుందో లేదో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు