కాంగ్రెస్‌కి గుడ్‌ బై చెప్పబోతున్నారా..

16 Nov, 2018 09:57 IST|Sakshi

మూడు నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి

స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తిలో ఇప్పటికే నామినేషన్లు

జనగామలో రాజీనామాల అస్త్రం

అధిష్టానం తీరుపై  కాంగ్రెస్‌ నాయకుల ఫైర్‌

ఇరకాటంలో పార్టీ అభ్యర్థులు

సాక్షి, జనగామ: కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ ఆశావహులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. వీరంతా కాంగ్రెస్‌కి  గుడ్‌ బై చెప్పబోతున్నారా.. అనే కొంతమంది అనుకుంటున్నారు, ఇటీవల పొన్నాల లక్ష్మయ్యకు టికెట్‌ రాకుంటే రాజీనామా చేస్తామని, స్వతంత్రంగా పోటీచేయించేందుకు పొన్నాలను ఒప్పిస్తామని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు  బహిరంగంగానే విమర్శలకు దిగడమే కాకుండా బుధవారం నామినేషన్లు సైతం వేశారు. మూడు నియోజకవర్గాల్లోనూ రెబల్స్‌ బెడద తప్పేట్లు లేదు. దీంతో పార్టీ అభ్యర్థులు ఇరకాటంలో పడుతున్నారు. 

కలవరపెడుతున్న రెబెల్స్‌..
కాంగ్రెస్‌ పార్టీలో రెబెల్‌ అభ్యర్థుల తీరు పార్టీ పెద్దలను కలవరపెడుతుంది. పార్టీలో టికెట్లు ఆశించిన నాయకులు మహాకూటమితో సీట్లు తారుమారయ్యాయి. తమకే టికెట్‌ ఖాయమని భావించి జనంతో మమేకమైన నాయకులకు చివరి నిమిషంలో అధిష్టానం ఝలక్‌ ఇచ్చింది. దీంతో కొందరు నాయకులు  బహిరంగ ఆరోపణలకు దిగుతున్నారు. స్టేఫన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో రెండు నెలల నుంచి మాదాసి వెంకటేష్‌ మండలాలు, గ్రామాల వారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అధిష్టానం తనకు టికెట్‌ హామీ ఇచ్చిందని ప్రచారం చేపట్టారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి గుండె విజయరామారావు నియోజకవర్గానికి పరిమితమై పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి పార్టీలో చేరిన దొమ్మాటి సాంబయ్య తీవ్రంగా టికెట్‌ కోసం ప్రయత్నించారు. చివరకు పార్టీ సింగపురం ఇందిరకు టికెట్‌ ఖరారు చేసింది. దీంతో టికెట్‌ ఆశించిన నాయకులు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మాదాసి వెంకటేష్‌ స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి కాంగ్రెస్‌ రెబెల్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. విజయరామారావు కూడా స్వతంత్రంగా నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు. అధిష్టానం పునరాలోచించాలని దొమ్మాటి సాంబయ్య డిమాండ్‌ చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో బిల్లా సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌ రెబెల్‌గా నామినేషన్‌ వేశారు. 

కలకలం రేపుతున్న వ్యాఖ్యలు..
కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తీరుపై సొంత పార్టీ నాయకులు ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి టికెట్‌ ఆశించిన మాజీ మంత్రి జి. విజయరామారావు, పీసీసీ నాయకులు టికెట్ల కేటాయింపులో చేతివాటం ప్రదర్శించారని తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు దొమ్మాటి సాంబయ్య టికెట్‌ ఖరారుపై పునారాలోచన చేయాలని కోరారు. జనగామ జిల్లా కేంద్రంలో పొన్నాలకు టికెట్‌ ఖరారులో జాప్యం చేస్తుండడంతో ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇరకాటంలో అభ్యర్థులు..
స్టేషన్‌ ఘన్‌పూర్, పాలకుర్తి నియోజవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. అభ్యర్థుల కేటాయింపులో అన్యాయం చేశారని రెబెల్స్‌ తిరుగుబాటు చేస్తుండడం అభ్యర్థులను ఇరకాటంలోకి నెట్టేస్తుంది. నామినేన్లు వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో తిరుగుబాటు ప్రకటించడంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.  

మరిన్ని వార్తలు