‘ఆ అభ్యర్థుల ఎన్నికను రద్దు చేయాలి’

25 Jan, 2019 05:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల చేతిలో ఓటమిపాలైన పలువురు కాంగ్రెస్‌ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తమపై గెలుపొందినవారి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఎన్నికల పిటిషన్లు(ఈపీ) దాఖలు చేశారు. ఈపీలు దాఖలు చేసినవారిలో నాగం జనార్దన్‌రెడ్డి, డీకే అరుణ, ఎ.రేవంత్‌రెడ్డి, లక్ష్మణ్‌కుమార్, దాసోజు శ్రవణ్‌కుమార్, చంద్రశేఖర్, ఫిరోజ్‌ఖాన్, కాసాని జ్ఞానేశ్వర్‌ తదితరులు ఉన్నారు. తమపై గెలుపొందిన వారంతా అక్రమ పద్ధతుల్లో విజయం సాధించారని తమ తమ పిటిషన్లలో పేర్కొన్నారు.

కొడంగల్‌లో తనపై గెలుపొందిన పట్నం నరేందర్‌రెడ్డి ఎన్నిక ల్లో అక్రమాలకు పాల్పడ్డాడని రేవంత్‌రెడ్డి తెలిపారు. అందువల్ల అతని ఎన్ని కను రద్దు చేసి తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని కోరారు. దర్మపురి నుంచి గెలుపొందిన కొప్పుల ఈశ్వర్‌ ఎన్నికను రద్దు చేయాలంటూ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తన పిటిషన్‌లో కోరారు. నాగర్‌కర్నూలు నియోజకవర్గంలో మర్రి జనార్దన్‌రెడ్డి ఎన్నికను నాగం జనార్దన్‌రెడ్డి సవాలు చేశారు.

గద్వాల నుంచి కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికను డీకే అరుణ సవాలు చేశారు. ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌ ఎన్నికను రద్దు చేయాలని దాసోజు శ్రవణ్‌ కోరారు. మహబూబ్‌నగర్‌లో వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికను సవాలు చేస్తూ టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్, నాంపల్లిలో ఎంఐఎం అభ్యర్థి ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్, సికింద్రాబాద్‌లో టి.పద్మారావుగౌడ్‌ ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ హైకోర్టును ఆశ్రయించారు.  

మరిన్ని వార్తలు