సామాజిక న్యాయంలో కాంగ్రెస్‌దే పైచేయి: ఉత్తమ్‌

29 Dec, 2018 01:45 IST|Sakshi

కాంగ్రెస్‌ 134వ ఆవిర్భావ దినోత్సవంలో కాంగ్రెస్‌ నేతలు 

సాక్షి, హైదరాబాద్‌: సామాజిక న్యాయం అమలు చేయడంలో కాంగ్రెస్‌కు మించిన పార్టీ లేదని, అణగారిన వర్గాలను ఆదుకోవడమే తమ పార్టీ మూల సిద్ధాంతమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై టీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ పార్టీ న్యా యపోరాటానికి సిద్ధమవుతుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ 134వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఉత్తమ్‌ మాట్లాడారు.

ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో బీజేపీ ఏకపక్ష తీరును విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అవకతవకల వల్లే తాము ఓడిపోయామని, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, సేవాదళ్‌ చైర్మన్‌ కనుకుల జనార్దనరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండ్లగణేశ్, ప్రధాన కార్యదర్శులు కైలాశ్, బొల్లు కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు