సీఎల్పీ నేతగా ఎన్నికయ్యేదెవరో?

10 Jan, 2019 02:14 IST|Sakshi

16 లేదా 17నకాంగ్రెస్‌ శాసనసభాపక్ష భేటీ!

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ఈ నెల 16 లేదా 17న జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు 17 నుంచి జరగనున్న నేపథ్యంలో సమావేశాల ప్రారంభానికి ముందే సీఎల్పీ సమావేశం నిర్వహిస్తారని చెబుతున్నా.. 17న అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యులుగా ప్రమాణం చేసిన అనంతరమే సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. ఈ సమావేశానికి అధిష్టానం దూతగా కేరళకు చెందిన లోక్‌సభ సభ్యు డు, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ 15న రాత్రి హైదరాబాద్‌ రానున్నారు. ఈయన సమక్షంలో పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక జరగనుంది. దీంతో సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటారన్నది పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా పనిచేసిన మల్లు భట్టి విక్రమార్క, మాజీ మం త్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సబి తా ఇంద్రారెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, లోక్‌సభ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవమున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నా యి.

వీరిలో ఉత్తమ్, భట్టిలను సీఎల్పీ నేతగా నియమించే విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. సీఎల్పీ రేసులో రాజగోపాల్‌రెడ్డి, శ్రీధర్‌బాబుల పేర్లూ వినిపిస్తున్నాయి. రాజగోపాల్‌రెడ్డి పేరును అధిష్టానం తీవ్రంగానే పరి శీలిస్తోందని, ఇందుకు తగినట్టు గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మద్దతు కూడగట్టుకునే పనిలో రాజగోపాల్‌రెడ్డి కొంత చురుకుగానే ఉన్నారని ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ విప్‌ గా, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అనుభవమున్న శ్రీధర్‌బాబు కూడా రేసు లో ముందున్నట్టు తెలుస్తోంది. సీఎల్పీ నేతగా మహిళకు అవకాశం ఇవ్వాలనుకుంటే సబితా ఇంద్రారెడ్డిని నియమించే అవకాశాలున్నాయి. మొత్తంగా సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటా రనేది కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా