రెబల్స్‌ దారెటు.. దూతల వ్యూహం ఫలించేనా?

18 Nov, 2018 14:57 IST|Sakshi

రెబల్స్‌తో చర్చలు జరుపుతున్న బుజ్జగింపుల కమిటీ

కొంతమంది నేతల నుంచి సానూకుల స్పందన

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా పాల్వాయి రజనీ

క్యామ మల్లేష్‌పై అధిష్టానం ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌ :  రేపటితో తెలంగాణ నామినేషన్ల గడవు ముగియనుండటంతో రెబల్స్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం రంగంలోకి దిగింది. వ్యూహ చతురతలో దిట్టగా పేరొందిన కర్ణాటక మంత్రి డి.కె.శివకుమార్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి, ఆ రాష్ట్ర వైద్య మంత్రి మల్లాడి కృష్ణారావులుతో కూడిన కమిటీ ఆశావాహులను బుజ్జగిస్తోంది. టికెట్‌ దక్కని వారికి పార్టీ అధికారంలోని రాగానే సముచిత స్థానం కల్పిస్తామనే హామీతో నేతలను చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్దమైన వరంగల్‌ డీసీసీ ప్రెసిడెంట్‌ నాయిని రాజేంధర్‌ రెడ్డితో కమిటీ భేటీ అయ్యింది. తాను ఇరవై ఏళ్లుగా పార్టీకి సేవచేస్తున్నానని వరంగల్‌ వెస్ట్‌ టికెట్‌ తనకే కేటాయించాలని ఆయన కమిటీ ముందు డిమాండ్‌ చేశారు. భవిష్యత్తుపై హామీ ఇస్తామని కమిటీ నచ్చచెప్పడంతో సాయంత్రంలోపు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన అన్నారు.

జనగామ నుంచి బరిలోకి దిగిన పొన్నాలతో భేటీ అయిన కమిటీ అక్కడి పరిస్థితి గురించి ఆరా తీసింది. ఇ​క ఖమ్మంలో సీటు అశించిన ఆ పార్టీ సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌తో కమిటీ భేటీ అ‍య్యింది. గతంలో కూడా పొత్తుల కారణంగా తనకు అన్యాయం జరిగిందని కమిటీ వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి వారు ఇంతకాలం చేసిన కృషిని అభినందిస్తూనే ఈసారి వెనక్కి తగ్గాలని దూతలు బుజ్జగిస్తున్నారు. పార్టీ తనకు టికెట్‌ ఇచ్చినా ఇవ్వకపోయిన పార్టీకి కోసం చివరి వరకు పని చేస్తానని ఆయన కమిటీతో తెలిపారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమి చెందిన పాల్వాయి గోవర్ధన్‌ కుమార్తె రజనీతో కూడా కమిటీ భేటీ అయ్యింది.

మూడు దశాబ్దాల పాటు తన తండ్రి పార్టీకి చేసిన సేవల గురించి ఆమె కమిటీ ముందు తెలిపారు. ఈసారి టికెట్‌ రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన రజినీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. సోమవారంతో నామిషన్ల గడవు ముగియనుండటంతో పార్టీకి కీలకంగా మారిన స్థానాల్లో రెబల్స్‌ను పోటీ చేయకుండా చూసేందుకు మరింత మంది ఆశావాహులతో కమిటీ భేటీ కానుంది. రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌పై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారని సోకాజ్‌ నోటీసును జారీ చేసినట్లు సమాచారం. ఆయన ఇబ్రహీంపట్నం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు