వారిపై అనర్హత వేటు వేయండి: టీ.కాంగ్రెస్

24 Jun, 2016 14:48 IST|Sakshi

హైదరాబాద్ : పెంచిన విద్యుత్,ఆర్టీసీ చార్జీలను కెసిఆర్ సర్కార్ తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం దిగి రాకపోతే ఇతర పార్టీలను కలుపుకుని కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తుందన్నారు. ఆదాయం పెరుగుతోందన్న ప్రభుత్వ పెద్దలు ఆ రాబడితో విద్యుత్, ఆర్టీసీ లోటును భర్తీ చేయాలన్నారు. మిషన్ భగీరథ,పాలమూరు రంగారెడ్డి,కాళేశ్వరం ప్రాజెక్టు ల నిర్మాణ అంచనాలను ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచడం వల్ల ఖజానా పై బారం పడుతుందన్నారు.

కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఇలా ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతుందని చిన్నారెడ్డి విమర్శించారు. అంతకు ముందు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చిట్టం రామ్మోహన్ రెడ్డి, పువ్వాడ అజయ్లపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, చిన్నారెడ్డి, సంపత్, పద్మావతి ఉత్తమ్, వంశీచంద్రెడ్డి తరతరులు స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ విప్ సంపత్ మాట్లాడుతూ తెరాసలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే లు చిట్టం రామ్ మోహన్ రెడ్డి,పువ్వాడ అజయ్ లపై అనర్హత వేటు వేయలంటూ స్పీకర్ మధుసూధనా చారికి ఫిర్యాదు చేశామన్నారు. ఆధారాలతో సహా పిటిషన్ సమర్పించినట్లు చెప్పారు. రెండేళ్లుగా తెరాస ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యంతో పాటు నైతిక విలువలను,రాజ్యాంగ స్పూర్తిని ఖునీ చేస్తోందని సంపత్ మండిపడ్డారు. డిస్ క్వాలిఫికేషన్ల పిటిషన్లపై స్పీకర్ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు ను ఆశ్రయించినట్లు చెప్పారు. జులై 1 న ఈ కేసు విచారణకు రానున్నదని తెలిపారు. డబ్బు సంచులకో, ప్రలోభాలకో,తెరాస బ్లాక్ మెయిలింగ్కో లొంగిపోయి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నారన్నారు.

ఫిరాయించిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయలంటూ తాము పిటిషన్ లు ఇచ్చినప్పటికీ స్పీకర్ స్పందించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ గీతారెడ్డి అన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యే లకు స్పీకర్ ఆఫీసు ఇప్పటివరకు నోటీసులే ఇవ్వలేదన్నారు. ఫిరాయింపు నిరోధక చట్టంను అమలు చేయాల్సిన స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఫిరాయింపుదారులపై నిర్ణయం తీసుకోకుండా రాజ్యాంగాన్ని బుట్టదాఖలు చేయడం ఎంతవరకు సమంజసమని గీతారెడ్డి ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు