పొన్నాల టికెట్‌ ఇవ్వలేదని కాంగ్రెస్‌కు13 మంది..

15 Nov, 2018 07:57 IST|Sakshi
రాజీనామా పత్రాలను చూపిస్తున్న కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు

సాక్షి, జనగామ: కాంగ్రెస్‌ ప్రకటించిన రెండు జాబితాల్లో టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు చోటుదక్కక పోవడాన్ని నిరసిస్తూ 13 మంది కౌన్సిలర్లు, ఏడు మండలాల పరిధిలో 28 వేల మంది కార్యకర్తలు బుధవారం తమ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి లేఖ పంపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎండి అన్వర్‌లు మాట్లాడారు. ఏడు మండలాల పరిధిలో మండల, జిల్లా బాధ్యులతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, బూత్‌ కమిటీ సభ్యులు, జనగామ మునిసిపల్‌ కౌన్సిలర్లు రాజీనామా చేసిన వారిలో ఉన్నట్లు పేర్కొన్నారు.

వచ్చే జాబితాలో పొన్నాల పేరు ప్రకటించని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాలుగు దశాబ్దాలుగా జనగామకు పెద్ద దిక్కుగా ఉంటూ.. కాంగ్రెస్‌కు వన్నె తీసుకు వచ్చిన పొన్నాలపై పార్టీలోని ఓ వర్గం కుట్ర పూరితంగా వ్యవహరించడం పద్ధతి కాదన్నారు. పొన్నాలను కాదని కూటమి తరుపున ఎవరు పోటీ చేయాలని ప్రయత్నించినా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల నుంచి ఎలాంటి సహకారం ఉండదని తేల్చి చెప్పారు. బీసీ నేత అని చిన్నచూపు చూస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్త కరుణాకర్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, మేడ శ్రీనివాస్, మల్లేశం, సర్వల నర్సింగారావు, చిర్ర సత్యనారాయణ రెడ్డి,  మహేందర్, అభిగౌడ్, రఘుఠాకూర్,  సంపత్‌నాయక్, మజార్‌ షరీఫ్,  శ్రీనివాస్, సత్యం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు