కాంగ్రెస్‌లో టికెట్‌ లొల్లి! 

16 Nov, 2018 19:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కేఎల్‌ఆర్‌కు సీటుపై రాజుకున్న అసమ్మతి 

నేడు బోడుప్పల్‌లో అసమ్మతివాదుల సమావేశం

సాక్షి మేడ్చల్‌ జిల్లా: మేడ్చల్‌ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ రాజుకుంది. కేఎల్‌ఆర్‌కు అధిష్టానం టికెట్‌ కేటాయించడంపై కాంగ్రెస్‌లోని అసమ్మతి నాయకులు భగ్గుమంటున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ ఓబీసీ వైస్‌ చైర్మన్‌ తోటకూరి జంగయ్య యాదవ్‌కు అధిష్టానం టికెట్‌ నిరాకరించటంతో శుక్రవారం బోడుప్పల్‌లో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్‌ అసమ్మతి వర్గం నిర్ణయించింది. ఇందులో, నాయకులు,కార్యకర్తలు వెల్లడించే అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్‌ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేయడమా? లేదా రెబల్‌గా మేడ్చల్‌ నుంచి బరిలోకి దిగడమా అన్న విషయంపై అసమ్మతి వర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డితో కలిసి రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు జంగయ్య యాదవ్‌కు మేడ్చల్‌ టికెట్‌ కేటాయించి, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ను పార్లమెంట్‌కు పంపించాలని గతంలో తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా అధిష్టానం టికెట్‌ ఇవ్వటంపై అసమ్మతి వర్గం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది.

ఇప్పటికైనా కేఎల్‌ఆర్‌ స్వచ్ఛందంగా పోటీ నుంచి విరమించుకుని, బీసీ సామాజిక వర్గానికి చెందిన జంగయ్య యాదవ్‌కు అవకాశం కల్పించాలని కోరుతోంది. స్థానికేతరుడైన కేఎల్‌ఆర్‌ కంటే స్థానికుడైన జంగయ్య యాదవ్‌కు టికెట్‌ ఇస్తే గెలిపించుకుంటామని అసమ్మతి వర్గం పేర్కొంటోంది. బోడుప్పల్‌ సమావేశం తర్వాత నియోజక వర్గంలోని వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులతో చర్చించి తన భవిష్యత్‌ కార్యక్రమాన్ని నిర్ణయించుకోవాలని జంగయ్య యాదవ్‌ భావిస్తున్నారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ నాయకులు వారి అనుచర వర్గం కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నట్టు సమాచారం.  మరో పక్క మేడ్చల్‌ టికెట్‌ పొందిన కేఎల్‌ఆర్‌ అధిష్టానం, రాష్ట్ర నేతల సహకారంతో అసమ్మతి వర్గాన్ని బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలెట్టినట్టు సమాచారం. పార్టీ పెద్దలతో జంగయ్య యాదవ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తానని కేఎల్‌ఆర్‌ అసమ్మతి వర్గం వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీలో భగ్గుమన్న అసమ్మతి ఎక్కడికి దారి తీస్తుందోనని కేడర్‌ ఆవేదన చెందుతుండగా, రాజకీయ పరిశీలకులు మాత్రం కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న పరిణామాలను క్షణ్ణంగా విశ్లేషిస్తున్నారు.  

మరిన్ని వార్తలు