21 నుంచి కాంగ్రెస్ జిల్లా స్థాయి సమీక్షలు

20 Jul, 2014 00:37 IST|Sakshi
21 నుంచి కాంగ్రెస్ జిల్లా స్థాయి సమీక్షలు

* రైతులకు ప్రత్యామ్నాయం చూపాలి
* డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి
ఎదులాపురం : ఎన్నికల ఫలితాలపై, భవిష్యత్తు రాజకీయాలపై చర్చించేందుకు జిల్లా స్థాయి సమీక్షలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రయత్నాలు ప్రారంభించిందని డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21 నుంచి హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆదిలాబాద్ జిల్లా సమీక్ష సమావేశంతో ప్రారంభం కానున్నాయని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఈ సమావేశాలు జరుగుతాయన్నారు. జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి 45 నిమిషాలపాటు సమావేశం ఉంటుందని తెలిపారు.

ఉదయం 10.00 గంటలకు సిర్పూర్ నియోజకవర్గ సమీక్ష సమావేశంతో ప్రారంభవుతాయని అన్నారు. తర్వాత వ రుసగా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని వివరించారు. అన్ని నియోజకవర్గ సమీక్షలో డీసీసీ అధ్యక్షులతోపాటు మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ డీసీసీ అధ్యక్షులు పాల్గొంటారని చెప్పారు. నియోజకవర్గ సమీక్షలో ఎమ్మెల్యే లేదా పోటీ చేసిన అభ్యర్థితోపాటు జెడ్‌పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, పీసీసీ, డీసీసీ, కార్యవర్గస్థాయి నాయకులు, పార్టీ ముఖ్య అనుబంధ సంఘాల నాయకులు పాల్గొంటారని సీఆర్‌ఆర్ వివరించారు.
 
రైతులకు వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయం చూపాలి
ప్రభుత్వం రైతాంగ సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఆర్‌ఆర్ పేర్కొన్నారు. రుణ మాఫీపై స్పష్టత లేక, ప్రకృతి సహకరించక రైతులు కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులకు వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని కోరారు. గతంలో ప్రజాపథం కార్యక్రమంలో అధికారులందరూ పాల్గొనే వారని, మన ఊరు-మన ప్రణాళికలో ఆశా వర్కర్లు అప్లికేషన్‌లు తీసుకొంటున్నారని విమర్శించారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి నరేష్ జాదవ్, నాయకులు యాసం నర్సింగ్‌రావ్, దిగంబర్‌రావ్ పాటిల్, అంబకంటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు