ఆ..రెండు పార్టీలకే!

3 Nov, 2018 10:09 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రధానంగా నాలుగు నియోజకవర్గాలు ఇప్పటిదాకా అయితే వామపక్షాలకు లేదంటే కాంగ్రెస్‌కు మాత్రమే జై కొట్టాయి. రాష్ట్రంలో తొలి ఎన్నికల నాటినుంచి ఇదే పరిస్థితి. టీడీపీ, బీజేపీ, తదితర పార్టీలెన్ని ప్రయత్నాలు చేసినా ఈ నియోజకవర్గాల్లో గట్టెక్కలేక పోయాయి. కానీ 2014 ఎన్నికల తర్వాత రెండు నియోజకవర్గాల్లో ఆ ఆనవాయితీ మారింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉధృతంగా సాగిన ప్రాంతాల్లోని ఈ నియోజకవర్గాల్లో వామపక్ష పార్టీలు తమ పట్టును పెంచుకున్నాయి. దీంతో ఎన్నికల పోటీ అంటే కమ్యూనిస్టులు వర్సెస్‌ కాంగ్రెస్‌ అన్న రీతిలో పోటాపోటీగా జరిగాయి. జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, మునుగోడు, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో ఇప్పటి దాకా వేరే పార్టీకే స్థానం లేకుండా పోయింది. 2014 ఎన్నిల్లో మాత్రం మునుగోడు, నకిరేకల్‌  నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించి ఆనవాయితీని మార్చి రాశాయి.

తొలుత పీడీఎఫ్‌గా.. తర్వాత సీపీఐ, సీపీఎంలుగా...!
దేవరకొండ : దేవరకొండ నియోజకవర్గానికి ఇప్పటి దాకా ఒక ఉప ఎన్నిక సహా పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి. 1952 తొలి ఎన్నికల్లో ప్రొగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) విజయం సాధించగా, కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సీపీఐ గెలుస్తూ వస్తోంది. సీపీఐ 1962, 1972, 1985, 1989, 1994 2004, తిరిగి 2014 ఎన్నికల్లో గెలిచింది. కాగా, సీపీఐ తరఫున బద్దుచౌహాన్‌ మూడు పర్యాయాలు, రమావత్‌ రవీంద్ర కుమార్‌ రెండు సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మరో వైపు కాంగ్రెస్‌ 1957, 1967, 1978, 1983, 1999, 2002–(ఉప ఎన్నిక), తిరిగి 2009 ఎన్నికల్లో గెలిచింది. కాంగ్రెస్‌ నుంచి రవీంద్ర నాయక్‌ ఒక్కరే వరుసగా రెండు సార్లు గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ పోరాడినా, చివరకు రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

 మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గ ఆవిర్భవానికంటే ముందు పెద్ద మునగాల నియోజకవర్గం ఉండింది. 1957 ఎన్నికల సమయంలో మిర్యాలగూడ ఏర్పాటయ్యింది. అప్పటినుంచి పదమూడు సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ ఏడు సార్లు, సీపీఎం ఐదు సార్లు పీడీఎఫ్‌ ఒకసారి మొత్తంగా వామపక్షాలు ఆరు సార్లు గెలిచాయి. 1957లో పీడీఎఫ్, ఆ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో (1962, 1967, 1972) కాంగ్రెస్‌ నుంచి తిప్పన చినకృష్ణారెడ్డి గెలిచారు.  ఆ తర్వాత 1983, 1989, 1999, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక, సీపీఎం 1978, 1985, 1994, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించింది. ఇందులో రెండు సార్లు అరిబండి లక్ష్మీనారాయణ, మూడు సార్లు జూలకంటి రంగారెడ్డి సీపీఎం తరఫున గెలిచారు.

మునుగోడు : తొలి నాలుగు ఎన్నికలు చిన్నకొండూరు నియోజకవర్గంగా, 1967 ఎన్నికల నాటి నుంచి మునుగోడు నియోజకవర్గంగా ఇప్పటికి పదిహేను పర్యాయాలు ఎన్నికలు జరిగితే, 2014లో గెలిచిన టీఆర్‌ఎస్‌ను మినహాయిస్తే కాంగ్రెస్, సీపీఐ (పీడీఎఫ్‌ విజయాలను పరిగణనలోకి తీసుకుంటే..)లు ఏడు సార్లు చొప్పున గెలిచాయి. ఇక్కడినుంచి టీడీపీ, జనతా, బీజేపీ తదితర పార్టీలు గెలవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్‌కు లేదంటే కామ్రేడ్లకే మునుగోడు అండగా నిలబడింది.

ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ సమరయోధుడు కొండా లక్ష్మన్‌ బాపూజీ రెండు సార్లు (1957, 1965) కాంగ్రెస్‌ తరఫున విజయం సాధిస్తే, అదే కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఏకంగా ఐదు సార్లు (1967, 1972, 1978, 1983, 1985) విజయం సాధించారు. దీంతో ఏడు సార్లలో కేవలం ఇద్దరు నాయకులే ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించినట్లు అయ్యింది. సీపీఐ కూడా ఏడు సార్లు నియోజకవర్గం నుంచి గెలవగా, ఉజ్జిని నారాయణరావు వరుసగా మూడు సార్లు (1985, 1989, 1994) గెలిచారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లోనూ సీపీఐ ఇక్కడినుంచి విజయం సాధించింది.

నకిరేకల్‌ : నకిరేకల్‌ నియోజకవర్గానికి ఇప్పటి దాకా పదమూడు సార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో టీఆర్‌ఎస్, 2009, 1972 కాంగ్రెస్‌ గెలిచింది. మిగిలిన పది ఎన్నికల్లోనూ వాపమక్షాలే గెలిచాయి. 1957 ఎన్నికల్లో పీడీఎఫ్, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగా ఉన్న సమయంలో 1962లో సీపీఐగా,  ఆ తర్వాత ఎనిమిది సార్లు సీపీఎం గుర్తుపైన విజయాలు సాధించింది. కాగా, నర్రా రాఘవరెడ్డి అత్యధికంగా ఆరు సార్లు (1967, 1978, 1983, 1985, 1989, 1994) విజయ ఢంకా మోగించారు. 1999, 2004 ఎన్నికల్లో వరసగా నోముల నర్సింహయ్య విజయం సాధించారు. 2004 ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో జరిగిన రెండు ఎన్నికల్లో (2009, 2014) సీపీఎం గెలుపు తీరాలను చేరుకోలేక పోయింది.

రద్దయిన రామన్నపేటలోనూ అదే దృశ్యం
1952లో ఏర్పాటైన రామన్నపేట నియోజకవర్గం 2004 ఎన్నికల తర్వాత రద్దయ్యింది. ఈ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నిక (1974) సహా పదమూడు సార్లు ఎన్నికలు జరిగాయి. 1952, 1957లో పీడీఎఫ్‌ తరఫున, 1962 ఎన్నికల్లో సీపీఐ తరఫున వరుసగా కె.రామచంద్రారెడి విజయాలు సాధించారు. ఆ తర్వాత 1967, 1972, 1974(ఉప ఎన్నిక), 1978, 1983 వరసగా ఐదు ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది. ఇక, 1983, 1985, 1994 ఎన్నికల్లో సీపీఐనుంచి గుర్రం యాదగిరిరెడ్డి హ్యాట్రిక్‌ విజయం సాధించగా, 1999, 2004 ఎన్నికల్లో ఉప్పునూత పురుషోత్తం రెడ్డి కాంగ్రెస్‌నుంచి గెలిచారు. అంటే కాంగ్రెస్‌ ఏడు సార్లు, వామపక్షాలు ఆరు సార్లు ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించాయి.

మరిన్ని వార్తలు