కూటమిపక్షాలకు కాంగ్రెస్‌ రిక్తహస్తం

19 Nov, 2018 09:21 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ మహాకూటమి ఊసు లేకుండా పోయింది.  ఇప్పటికే ఆ పార్టీ పదకొండు నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. ఇక మిగిలిన మిర్యాలగూడ టికెట్‌ను ఆదివారం రాత్రి తన ఖాతాలో వేసుకున్నట్లు ప్రకటించింది. ఈ ఒక్క స్థానంపై తెలంగాణ జన సమితి, కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకున్నాయి. చివరకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యను ప్రకటించింది. కాగా, టీజేఎస్‌  అభ్యర్థిగా గవ్వా విద్యాధర్‌రెడ్డికి ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం హైదరాబాద్‌లో ఆదివారం బీఫాం కూడా అందజేశారు. మరో వైపు కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగాలని ఆశపడుతున్న అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి ఒకవేళ ఈ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయిస్తే తాను రెబల్‌గా బరిలో ఉంటానని ప్రకటించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ప్రకటిం చడంతో తరువాత రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూడాలి.

మొత్తానికి  కూటమి పక్షాలకు ఎక్కడా అవకాశం రాకపోగా, అన్ని చోట్లా కాంగ్రెస్‌ పోటీలో ఉంది.కూటమి పక్షాల డకౌట్‌ కాంగ్రెస్‌ మహాకూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఇంటి పార్టీ సీట్లు ఆశించాయి. టీడీపీ కోదాడ, లేదంటే నకిరేకల్‌ ఇవ్వాలని పట్టుబట్టాయి. సీపీఐ ఆలేరు లేదా మునుగోడు కావాలని భీష్మించాయి. ఆ పార్టీకి రాష్ట్రంలో మూడు స్థానాలే కేటాయించడం సమస్యగా మారింది. ఒకవేళ అదనంగా తమకు ఓ స్థానం ఇస్తే దేవరకొండ కావాలని ఆపార్టీ కోరింది. మరోవైపు టీజేఎస్‌ ముందునుంచీ మిర్యాలగూడ గురించే పట్టుబడుతోంది. తెలంగాణ ఇంటి పార్టీ నకిరేకల్‌ను కోరుతూ వచ్చింది. ఒక దశలో ఆ పార్టీకి నకిరేకల్‌ ఇస్తున్నట్లు కూడా ప్రకటన వచ్చింది. ఇది కాదంటే మునుగోడు గురించి చర్చ జరుగుతుందన్నారు.

తీరా కాంగ్రెస్‌ తన అభ్యర్థులను ప్రకటించాక  కూటమి పక్షాలకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కకుండా పోయాయి.  ప్రతి ఎన్నికల్లో దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో పోటీ చేసిన సీపీఐ ఈసారి మాత్రం నామమాత్రంగా మిగిలిపోయింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ దేవరకొండ నుంచి ప్రాతినిధ్యం వహించింది. అంతకుముందు మునుగోడు నుంచి ప్రాతినిధ్యం వహించింది. ఈసారి ఆ పార్టీ ఎన్నికల బరిలోనే లేకుండా పోయింది. మరోవైపు తెలంగాణ ఇంటి పార్టీ కూటమినుంచి బయటకు వచ్చేసి నకిరేకల్‌ స్థానానికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లాలో సుదీర్ఘ కాలం ఆధిపత్యం వహించిన టీడీపీ కూడా ఈసారి ఒక్కస్థానం నుంచి కూడా పోటీలో లేకుండా అయ్యింది.

బయటకు వస్తున్న నేతలు
కాంగ్రెస్, కూటమిలోని ఇతర పార్టీల నుంచి టికెట్లు ఆశించిన నేతలు ఇక, తమకు టికెట్లు రావన్న నిర్ధారణకు వచ్చాక సొంత పార్టీలను వీడుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్యానాయక్‌ ఏడాది కిందట కాంగ్రెస్‌లో చేరారు. ఆయన ఆ పార్టీలో చేరిందే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ లభిస్తుందన్న ఆశతో. కానీ, కాంగ్రెస్‌ ఆయనకు మొండిచేయి చూపెట్టింది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బాలునాయక్‌కు దేవరకొండ టికెట్‌ను ప్రకటించడంతో బిల్యానాయక్‌ కాంగ్రెస్‌ను వీడి బయటకు వచ్చారు. సోమవారం ఆయన ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇక, టీడీపీనుంచి కోదాడ టికెట్‌ ఆశించిన బొల్లం మల్లయ్య యాదవ్‌కూ అవకాశం దక్కలేదు. కాంగ్రెస్‌ తమ సిట్టింగ్‌ స్థానం కావడంతో తాజా మాజీ ఎమ్మెల్యే పద్మావతికే అభ్యర్థిత్వం ఖరారు చేసింది. దీంతో అవకాశం కోల్పోయిన మల్లయ్య యాదవ్‌ టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. ఇలా ఆయా స్థానాల్లో బలమైన నాయకులు అనుకున్న వారు సొంత పార్టీలను వీడి బయటకు వచ్చి పోటీకి సిద్ధమవుతున్నారు.    

మరిన్ని వార్తలు