వీడని ‘కూటమి’ పీటముడి

22 Oct, 2018 09:47 IST|Sakshi

కాంగ్రెస్‌ శ్రేణుల్లో ‘మహా’ కలవరం నెలకొంది. అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడం, ప్రచారం ఊపందుకోక పోవడంపై కార్యకర్తల్లో అయోమయం కొనసాగుతోంది. పొత్తుల వల్ల ఎవరికి రిక్త‘హస్తం’ చూపుతారోననే ఉత్కంఠ అనుచరులను వెంటాడుతోంది. ప్రత్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్‌ పార్టీ వెనుకబడింది. అభ్యర్థులెవరో తేలక పోవడం, సీట్ల సర్దుబాటులో ఏ స్థానం ఎవరికి వెళ్తుందో తెలియక పోవడమే అందుకు ప్రధాన కారణం. దీంతో రెండు, మూడు నియోజకవర్గాల్లో మినహా మిగతా ఆరుచోట్ల ప్రచారం అంతంత మాత్రంగానే కొనసాగుతోంది.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.. వీరంతా ఇప్పటికే తొలి విడత ప్రచారంలో నియోజకవర్గాన్ని చుట్టి వచ్చారు. తాజాగా బీజేపీ కూడా ఉమ్మడి జిల్లాలో మూడు నియోజకవర్గాల కు అభ్యర్థులను ఖరారు చేసింది. వారు కూడా ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్‌ అభ్యర్థిత్వాలపై ఉత్కంఠ కొనసాగుతుండటంతో రెండు, మూడు నియోజకవర్గాల్లో మినహా ఎక్క డా ఆ పార్టీ ప్రచారం కనిపించడం లేదు. టికెట్‌ రేసులో ఉన్న ఆశావహులు అడపాదడపా నియోజకవర్గంలోని అనుచరులతో భేటీ అవుతున్నారే తప్ప ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయడం లేదు.

పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, టీజేఎస్‌కు ఏ స్థానం కేటాయిస్తారనేది ఇంకా తేలక పోవడంతో ఆయా స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఇటు అభ్యర్థులు కూడా ప్రచారానికి వెళ్లలేక పోతున్నారు. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్‌ స్థానాల్లో మినహా మిగిలిన ఆరు నియోజక వర్గాల్లో ఇప్పటి వరకు ప్రచారం అంతంత మాత్రంగానే సాగుతోంది.

మూడు నియోజకవర్గాల్లోనే.. 
కామారెడ్డిలో కాంగ్రెస్‌ ప్రచారం జోరుగా సాగు తోంది. పక్షం రోజుల క్రితం ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించా రు. తాజాగా కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఇక, బోధన్‌లో కూడా పార్టీ ప్రచారం బాగానే జరుగుతోంది. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్‌రెడ్డి రోడ్‌ షో, బహిరంగ సభలో పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఆకుల లలిత ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కానీ మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో ప్రచారం అంతంతగానే సాగుతోంది.


మిగతా చోట్ల అంతంతే.. 
నిజామాబాద్‌ రూరల్‌ స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకుని కాంగ్రెస్‌లో చేరిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ప్రచారం ప్రారంభించారు. ఆయా మండలాల్లోని గ్రామాలను చుట్టి వచ్చారు. తీరా ఇక్కడ మహా కూటమి పొత్తు లో భాగంగా టీడీపీ ఈ స్థానాన్ని ఆశిస్తున్నట్లు ప్రచారం జరగడం, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇటీవల తన అనుచరులతో సమావేశం నిర్వహించడంతో ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న భూపతిరెడ్డి కొంత మేరకు ప్రచారం తగ్గించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటు ఆయన అనుచరవర్గంలోనూ అయోమయం నెలకొంది.
 
బాల్కొండలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఈ స్థానంపై టీడీపీ కన్నేయడంతో కాంగ్రెస్‌ టికెట్‌ రేసులో ఉన్న ఈరవత్రి అనిల్‌ పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించ లేకపోతున్నారు. అడపాదడపా అనుచర వర్గంతో భేటీ అవుతున్న అనిల్‌.. అభ్యర్థిత్వంపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చాకే ప్రచారంలో వేగం పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

నిజామాబాద్‌ అర్బన్‌లో అయితే కాంగ్రె స్‌ పార్టీ ప్రచారానికి అసలు శ్రీకారమే చుట్టలేదు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాత్రం ఇప్పటికే నగరంలోని అన్ని డివిజన్లలోనూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. కుల సంఘాలు, వివిధ అసోసియేషన్లతో ఆత్మీయ సమ్మేళనాలను ని ర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో తేల క పోవడంతో ఆ పార్టీ ఇంకా క్షేత్ర స్థాయిలోకి వెళ్లలేదు. బాన్సువాడ, ఎల్లారెడ్డి స్థానాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ పూర్తి స్థాయి ప్రచారం జరగడం లేదు. జుక్కల్‌లో మాత్రం ఇద్దరు ఆశావహులు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. వారం రోజుల్లో టికెట్లపై ఓ స్పష్టత వస్తుందని, అప్పటి వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’తో తెలిపారు.

మరిన్ని వార్తలు