ఎవరికి వారే..!

29 Jul, 2018 07:01 IST|Sakshi
కాంగ్రెస్‌ నాయకులు

సాక్షి, జనగామ: జిల్లాలోని కాంగ్రెస్‌ నాయకుల్లో సమన్వయం కరువైందని కార్యకర్తలు పేర్కొంటున్నారు. నాయకులు పోటాపోటీగా ప్రజలను కలవడానికి ప్రయత్నిస్తుండడంతో వారు అయోమయానికి గురవుతున్నారు. సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో నాయకులు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం మినహా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్యనే పోటీ నెలకొంది. జనగామ నియోజకవర్గంలో పట్టు కోసం మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో జనగామ అంతర్భాగంగా ఉంది.

2009–14 మధ్య కాలంలో భువనగిరి ఎంపీగా రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. ఎంపీగా ఉన్న సమయంలో జనగామ ప్రాంతంలో ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికి రాజగోపాల్‌రెడ్డి సొంత క్యాడర్‌ను కలిగి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటారనే పేరున్న రాజగోపాల్‌రెడ్డి ఇటీవల జనగామలో పర్యటించారు. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు దంపతుల కుటుంబాన్ని సిద్ధంకిలో పరామర్శించారు.

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనే జనగామలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకుంటామని వ్యాఖ్యానించారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. జనగామ నుంచి 2019లో జరుగనున్న ఎన్నికల్లో ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీని బరిలోకి దించే ఆలోచన చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 2009 ఎన్నికల్లో భర్త రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం ఈ ప్రాంతంలో ఆమె స్వయంగా ప్రచారం నిర్వహించారు. ప్రచార సరళిలో ఆమె ప్రజలను విశేషంగా ఆకర్షించారు. ప్రజలకు పరిచయం ఉండడంతో టికెట్‌ను ఆశిస్తున్నట్లు కొమటిరెడ్డి వర్గీయులు చెబుతుండడం గమనార్హం.

ఘన్‌పూర్‌లో మూడు ముక్కలాట..
స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ మూడు ముక్కలాటగా మారింది. మాజీ మంత్రి జి.విజయరామారావు, బి.ఆరోగ్యం, సిం గపురం ఇందిర మూడు వర్గాలుగా విడిపోయారు. ముగ్గురు నేతలు ఎవరికి వారుగా వర్గాలు విడిపోయి ప్రజలను కలుస్తున్నారు. ముగ్గురు టికెట్ల ను ఆశిస్తూ సొంత ఇమేజ్‌ కోసం ప్రయత్నిస్తున్నా రు. అయితే కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు ముందు టీపీసీసీ నియోజకవర్గ సభ్యులుగా జి.విజయరామారావు, గంగా రపు అమృతరావును నియమించింది. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో బస్సు యాత్ర నియోజకవర్గంలో కొనసాగినా ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదు. కనీసం రోడ్‌ షోను సైతం చేపట్టక పోవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. యాత్రను ప్రజల చైతన్యవంతం కోసం ఉపయోగించుకోవడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

పొన్నాలపై ఏఐసీసీ కార్యదర్శికి ఫిర్యాదు..
ఇటీవల భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ సమావేశంలో జనగామ నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు పొన్నాల లక్ష్మయ్యపైనే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత నుంచి పొన్నాల కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఈ నెల 17వ తేదీన జరిగిన పార్టీ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శికి విన్నవించారు. దీంతో ఆ పార్టీలోని అంతర్గత కలహాలు బహిర్గతమయ్యాయి. కానీ, జనగామ నుంచి పొన్నాల నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు పర్యాయాలు కేబినెట్‌ మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో మంచి మేధావిగా, బీసీ నేతగా గుర్తింపు ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో జనగామ అనగానే పొన్నాల అనే స్థాయిలో పేరుంది. అయితే పొన్నాల, కోమటిరెడ్డి ఒకే పార్టీ అయినా వేర్వేరుగా పర్యటనలు చేయడం రాజకీయ చర్చకు దారితీస్తోంది.
 
పాలకుర్తిలో గ్రూపులకుతావివ్వకుండా..
పాలకుర్తి నియోజకవర్గంలో జంగా రాఘవరెడ్డి మాత్రమే ఎలాంటి గ్రూపులకు తావివ్వకుండా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిత్యం అందుబాటులో ఉంటూ కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల మధ్యలో ఎండగడుతూనే నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏప్రిల్‌లో పాలకుర్తిలో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రను సక్సెస్‌ చేయడంతో జంగాకు అధిష్టానం నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇటీవల రైతు దీక్ష సందర్భగా పాలకుర్తి నుంచి జనగామ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలను ఆకర్షించారు.

>
మరిన్ని వార్తలు