‘ప్రాదేశికం’లో ప్రాభవం.. కాంగ్రెస్‌లో కొత్త ఆశలు

16 May, 2019 01:51 IST|Sakshi

మండలాల వారీగా నివేదికలు తెప్పించుకున్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ 

20కి పైగా జడ్పీ స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చామంటున్న నేతలు 

అర్బన్‌తో పాటు చిన్న జిల్లాలు, పాత జిల్లా కేంద్రాలపైనే భరోసా

సాక్షి, హైదరాబాద్‌: పరిషత్‌ పోరుపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ గట్టి ఆశలే పెట్టుకుంది. ముగిసిన మూడు విడతల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు మెజార్టీ స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కనీసంగా 20 జిల్లా పరిషత్‌లలో టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొన్నామని, ఆయా స్థానాల్లో మెజార్టీ పీఠాలు కైవసం చేసుకుంటామని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అర్బన్‌ ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లాలు, గ్రామీణ జిల్లాలే అయినా చిన్న జిల్లాలు, పాత జిల్లా కేంద్రాలున్న చోట్ల ఓటర్లను తమ వైపు తిప్పుకోగలిగామని, మిగిలిన చోట్ల కూడా శక్తిమేరకు పోరాడామని కాంగ్రెస్‌ నేతలు చెప్తున్నారు. కాగా, ప్రాదేశిక ఎన్నికలపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండలాల వారీగా నివేదికలు తెప్పించుకుని ఫలితాలపై బేరీజు వేస్తున్నారు. ‘ప్రాదేశికం’లో కాంగ్రెస్‌ ప్రాభ వం చాటుతుందని అంచనా వేస్తున్నారు.  

10 పీఠాలన్నా దక్కాలి 
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో గట్టిపోటీనే ఇచ్చినా జిల్లా పరిషత్‌ పీఠాలు దక్కించుకునే విషయంలో చాలా కష్టపడాల్సి వస్తుందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ కన్నా ఒకటి, రెండు జడ్పీటీసీ స్థానాలు ఎక్కువగానే సాధించినా అధికార పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలంతో పరిషత్‌ పీఠం చేజారుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కనీసం 10 జడ్పీ స్థానాలయినా దక్కుతాయా లేదా అన్నదానిపై లెక్కలు కడుతున్నారు. ఈ లెక్కల కోసమే టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండలాల నుంచి తెప్పించుకున్న నివేదికలపై కసరత్తు చేస్తున్నారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

స్థానిక అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న జిల్లాలకు చెందిన ఫలితాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని, ఏ మాత్రం అవకాశం ఉన్నా జిల్లా పరిషత్‌ పీఠం చేజారిపోకుండా వ్యూహం రచిస్తున్నారని అంటున్నాయి. అదే విధంగా ఎంపీటీసీల విషయంలో కూడా మంచి ఫలితాలే సాధిస్తామని, కనీసం 100–150 ఎంపీపీ పీఠాలు కూడా దక్కే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తున్నారు. వీటిపై కూడా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ బృందం భారీ కసరత్తే చేస్తోందని తెలుస్తోంది.  

అవసరమైతే క్యాంపులు 
ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు ఈనెల 27నే వస్తున్నప్పటికీ జడ్పీ చైర్మన్లు, ఎంపీపీల ఎన్నిక కోసం జూలై4 వరకు ఆగాల్సి ఉంటుంది. అప్పటివరకు పాత సభ్యుల పదవీకాలం ఉన్నందున ఆ తర్వాతే కొత్త సభ్యులతో చైర్మన్లను ఎన్నుకుంటారు. అంటే ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి, ఫలితాలకు నెలకు పైగా సమయం ఉంది. ఈలోపు ఏం జరుగుతుందనే దానిపై కూడా కాంగ్రెస్‌ నేతలు ఓ అంచనాకు వస్తున్నారు. గెలిచిన సభ్యుల సాయంతో జిల్లా లేదా మండల పరిషత్‌ పీఠాన్ని దక్కించుకునే అవకాశం స్పష్టంగా ఉంటే అవసరమైతే నెలరోజుల పాటు క్యాంపులు నిర్వహించే ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు.

దీంతో పాటు టీఆర్‌ఎస్‌కు మేలు జరిగేలా తమ పార్టీకి చెందిన కొత్త జడ్పీటీసీలు, ఎంపీటీసీలు నిర్ణయం తీసుకోకుండా వారిని కూడా వీలున్నంత మేర కట్టడి చేసేందుకు పథకాలు రూపొందిస్తున్నారు. అటు తమకు దక్కాల్సిన వాటిని దక్కించుకోవడంతో పాటు తమ ద్వారా టీఆర్‌ఎస్‌కు మేలు చేకూరకుండా అన్ని జాగ్రత్తలను ఇప్పటి నుంచే తీసుకుంటున్నామని, ఫలితాల తర్వాత వ్యూహం అధికారికంగా వెల్లడవుతుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించడం గమనార్హం.

మరిన్ని వార్తలు