నేనేం తప్పు చేశా!

19 Nov, 2018 09:06 IST|Sakshi
కంటతడి పెడుతున్న ముత్యంరెడ్డి

డబ్బులు లేవనే కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వలేదు

కంట తడిపెట్టిన మాజీ మంత్రి ముత్యంరెడ్డి

ఓదార్చిన హరీశ్‌రావు, సోలిపేట

సాక్షి, సిద్దిపేట: ‘నా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడూ ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా పని చేయలేదు. ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పని చేస్తున్నా. దానికి గుర్తింపుగా నాలుగు పర్యాయాలు నన్ను ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు. టీడీపీ ప్రభుత్వంలో.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా, అంచనాల కమిటీ చైర్మన్‌గా ఉన్నత పదవులను చేపట్టాను.
ప్రజలకు చేరువయ్యాను. నా సేవలను గుర్తించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పిలిచి మరీ పార్టీ టికెట్‌ ఇచ్చారు.

ఆయన ఆశీస్సులతో మరోసారి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా గెలుపొందాను. ఇంతటి ప్రజాదరణ ఉన్న నేను ఏం తప్పు చేశానని నాకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వలేదు’ అని మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి గద్గద స్వరంతో అంటూ కంటతడి పెట్టారు. దొమ్మాట, దుబ్బాక నియోజకవర్గాలకు 3 పర్యాయాలు టీడీపీ నుంచి, 2009లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ద్వారా మొత్తం నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అప్పట్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా, అంచనాల కమిటీ చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడిగా పలు పదవులను అలంకరించారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రతిపక్ష నాయకుడిగా నియోజకవర్గంలో పనిచేస్తూ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ తనకే టికెట్‌ ఇస్తుందని భావించి భంగపడ్డారు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా దుబ్బాక స్థానాన్ని టీజేఎస్‌కు అప్పగించారు.

దీనిపై కలత చెందిన ఆయన ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మహనీయులు స్థాపించిన కాంగ్రెస్‌ పార్టీలో నైతిక విలువలు లేకుండా పోతున్నాయని తొగుటలోని తన నివాసంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను ఓదార్చేందుకు వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఎదుట తన బాధను వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టారు. 

విభిన్న ధ్రువాలు ఒక్కటవుతున్నాయి..
గతంలో తెలుగుదేశం పార్టీలో సీఎం కేసీఆర్, ముత్యంరెడ్డిలు ఎమ్మెల్యేలుగా కలిసి పనిచేశారు. ఒకే జిల్లాతో పాటు ఒకే రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న దొమ్మాట, సిద్దిపేటలలో ఎమ్మెల్యేలుగా ఉ న్న ఇరువురిలో ఒక్కరికే మంత్రి పదవి ఇవ్వాలన్న సమీకరణాలతో ముత్యంరెడ్డికి పౌరసరఫరాల శాఖ మంత్రి పదవి ఇచ్చారు. దీంతో అప్పట్లో కేసీఆర్‌కు మంత్రి పదవి దక్కలేదు. ఆ సమయంలో వీరిరువురికి మధ్య విభేదాలు తలెత్తాయి. అనంతరం కేసీఆర్‌ తెలంగాణ నినాదంతో టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించారు. నాడు ఒకే పార్టీలో విరోధులుగా ఉన్న కేసీఆర్, ముత్యంరెడ్డిలు ఇప్పుడు తిరి గి మిత్రులుగా మారనున్నారు.

ఇదిలా ఉంటే మూడేళ్ల క్రితం అనారోగ్యంతో బాధపడిన ముత్య ంరెడ్డికి కేసీఆర్‌ చికిత్స కోసం సాయం అందించారు. రాజకీయపరంగా శత్రువులుగా ఉన్నా సాయం అడిగిన వెంటనే కేసీఆర్‌ ఏమాత్రం ఆలోచించకుండా అందించడంతోపాటు ఇప్పుడు కాం గ్రెస్‌ టికెట్‌ దక్కక నిరాశతో ఉన్న సమయంలోనూ ఆయన్ను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనను హరీశ్‌రావు, రామలింగారెడ్డిలు కలిసి విషయాన్ని వెల్లడించారు.

ఎప్పుడు కూటమి ఏర్పడినా ‘ముత్యం’కు మొండిచేయి..
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎప్పుడు కూట మి ఏర్పడినా మాజీ మంత్రి ముత్యంరెడ్డికి మా త్రం మొండిచేయి చూపుతూ వచ్చారు. 2009 సాధారణ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎంలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఆ సమయంలో దుబ్బాక స్థానం కూటమి నుంచి టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డికి దక్కింది. 

దీంతో టీడీపీలో ఉన్న ముత్యంరెడ్డికి చుక్కెదురైంది. కాగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. ముత్యంరెడ్డిని పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా ప్రస్తుత ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐలు మహాకూటమిగా ఏర్పడడంతో దుబ్బాక టికెట్‌ ముత్యంరెడ్డికి కాకుండా టీజేఎస్‌కు కేటాయించడంతో మరోసారి ఆయనకు కూటమిలో ఎదురుదెబ్బ తగిలినట్టయింది. 

మరిన్ని వార్తలు