నా వయసు పెరిగిపోయింది నాకు సీఎం పదవి...

22 Nov, 2018 11:02 IST|Sakshi
కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న పీసీసీ సభ్యుడు వేణుగౌడ్‌

శంషాబాద్‌: ‘నేను సీఎం పదవిని కోరుకోవడం లేదు.. ఇప్పుడు నా వయసు కూడా పెరిగిపోయింది.. ఒంటి చేత్తో పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టించడంలో కీలక పాత్ర వహించా..నా నైతిక బాధ్యతగా రాష్ట్రంలో మహాకూటమిని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తున్నా ’ అని కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి చెప్పారు.  రాజేంద్రనగర్‌ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్‌ నాయకుడు ఎం. వేణుగౌడ్‌ను బుజ్జగించడానికి  ఆయన శంషాబాద్‌లోని వేణుగౌడ్‌ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహాకూటమి గాలి వీస్తోందని, ప్రస్తుతం ప్రభుత్వపై కొనసాగుతన్న నిశ్శబ్ద విప్లవ ఫలితాలు ఎన్నికల రోజు భయటపడుతాయన్నారు.

తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి తాను  ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించానని, తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌ అప్పట్లో అధికారంలోకి రాకపోవడం బాధాకరమన్నారు. ఈ దఫా కాంగ్రెస్‌ పార్టీయే సొంతంగా ఎనిభైకి పైగా స్థానాల్లో గెలుపొందుతుందన్నారు. ప్రధాని మోదీతో దోస్తీ చేసిన కేసీఆర్‌ను మైనార్టీలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీఆర్‌ఎస్‌ సంస్కృతి నచ్చకనే చేవెళ్ల ఎంపీ విశేశ్వర్‌రెడ్డి ఆ పార్టీని వీడారన్నారు. వేల కోట్లు సంపాదించిన అహంభావంతో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాడన్నారు. ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టీఆర్‌ఎస్‌ సర్కారుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. దేశ చరిత్రలో ఇందిరాగాంధీ తప్ప ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వారెవరూ విజయం సాధించలేదని జైపాల్‌రెడ్డి చెప్పారు.

రాజకీయాలు సంక్లిష్టమైనవి...
రాజకీయాలు ఎంతో సంక్లిష్టంగా ఉంటాయని, అవసరమైనపుడు పార్టీ భవిష్యత్తు కోసం త్యాగాలు కూడా అనివార్యంగా మారుతాయని కేంద్ర మాజీ మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం నుంచి పీసీసీ సభ్యుడు ఎం. వేణుగౌడ్‌ వేసిన నామినేషన్‌ను ఆయన ఉపసంహరింపజేశారు. అనంతరం శంషాబాద్‌ పట్టణంలోని వేణుగౌడ్‌ నివాసంలో ఆయన మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీకి సేవచేసిన వేణుగౌడ్‌కు రాజేంద్రనగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా అవకాశం రావల్సి ఉన్నప్పటికి కొన్ని సమీకరణాలతో సాధ్యం కాలేదన్నారు. క్రమశిక్షణగల పార్టీ నాయకుడిగా సేవలందిస్తున్న ఆయనకు సమీప భవిష్యత్తులోనే కాంగ్రెస్‌ పార్టీ సముచితంగా గౌరవిస్తుందన్నారు.

జిల్లా పరిషత్, ఎమ్మెల్సీ  ఎన్నికల్లో ఆయనకు అవకాశముంటుందన్నారు. చేవెళ్ల పార్లమెంటు ఎంపీగా తాను పోటీ చేసిన సమయంలో తన గెలుపులో వేణుగౌడ్‌ది కీలకమైన భాగస్వామ్యముందన్నారు. మహాకూటమి గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన సూచించారు. జైపాల్‌రెడ్డి సూచనతో వేణుగౌడ్‌కు అక్కడికక్కడే నామినేషన్‌ ఉపసంహరణ పత్రాలపై సంతకం చేశారు. పార్టీ నిర్ణయం మేరకు కూటమి అభ్యర్థికి విజయానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో శంషాబాద్‌ సర్పంచ్‌ రాచమల్ల సిద్దేశ్వర్, నందరాజ్‌గౌడ్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు