కాంగ్రెస్‌కు షాక్‌ !

8 Sep, 2018 13:21 IST|Sakshi
మాజీ స్పీకర్‌ కేతిరెడ్డి సురేశ్‌రెడ్డి

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. పార్టీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కేతిరెడ్డి సురేశ్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడటంతో ఆ పార్టీ ఎదురు దెబ్బతిన్నది. ఈ నెల 12న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం హైద రాబాద్‌లో సురేశ్‌రెడ్డి నివాసానికి మంత్రి కేటీఆర్, బాల్కొండ, ఆర్మూర్‌ తాజా మాజీ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. సురేశ్‌రెడ్డి పార్టీని వీడనుండటం ఉమ్మడి జిల్లా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఇప్పటికే కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ చాలామట్టుకు కారెక్కింది. ద్వితీయ శ్రేణి నాయకత్వం కాంగ్రెస్‌ను వీడింది.

తాజాగా జిల్లాలో ఆ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన మాజీ స్పీకర్‌ పార్టీని వీడటం చర్చనీయాంశంగా మారింది. సీని యర్‌ నేతగా పేరున్న సురేశ్‌రెడ్డి మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1989, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలుపొందారు. తిరిగి 2004 ఎన్నిక ల్లో కూడా విజయం సాధించిన ఆయన శాసనసభా స్పీకర్‌గా పనిచేశారు. తర్వా త 2009, 2014 ఎన్నికల్లో ఆర్మూర్‌ ని యోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన వరుసగా రెండు పర్యాయాలు ఓటమిని చవిచూశారు.

దాదాపు 35 సం వత్సరాల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన సురేశ్‌రెడ్డి గులాబీ గూటికి వెళ్లడం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఒక్కసారిగా కుదుపునకు గురైంది. గులాబీ గూటికి చేరనున్న సురేశ్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ స్పష్టమైన హామీనిచ్చినట్లు ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. ఆయన సేవలను జాతీయ రాజకీయాలకు వినియోగించుకోవాలని యో చిస్తున్నట్లు సమాచారం. ఇందులో భా గంగా రాజ్యసభ సీటు కేటాయిస్తామనే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించనున్నారనే ప్రచారం కూడా కొనసాగుతోంది.

గురువారం హైడ్రామా..
సురేశ్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ఆరు నెలల కిత్రం ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకునే వరకూ బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడ్డారు. టీఆర్‌ఎస్‌ గూటికి వెళుతున్నట్లు ఆయన అనుచర వర్గానికి కూడా సమాచారం లేదు. సురేశ్‌రెడ్డిని పార్టీలోకి తీసుకురావడంలో ఎంపీ కవిత కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ విషయమై పలుమార్లు సురేశ్‌రెడ్డితో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు సురేశ్‌రెడ్డి పార్టీని వీడుతున్న విషయం పసిగట్టిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం రాత్రి సురేశ్‌రెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడినట్లు తెలిసింది.

ఏదైనా ఉంటే మాట్లాడుకుందామని, పార్టీని వీడవద్దని బుజ్జగించినట్లు సమాచారం. సురేశ్‌రెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో జిల్లా కాంగ్రెస్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. తన నియోజకవర్గం బోధన్‌లో శుక్రవారం కార్యక్రమాలను రద్దు చేసుకున్న మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డి హుటాహుటిన హైదరాబాద్‌ తరలివెళ్లారు. అలాగే డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బిన్‌ హందాన్, పీసీసీ నేత గడుగు గంగాధర్‌ కూడా శుక్రవారం పీసీసీ సమావేశానికి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు