‘పీసీసీకి సంబంధం లేకుండా పాదయాత్ర చేస్తా’

12 Jul, 2017 14:29 IST|Sakshi
‘పీసీసీకి సంబంధం లేకుండా పాదయాత్ర చేస్తా’

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో పాదయాత్ర చేస్తానని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. పీసీసీకి సంబంధం లేకుండా కాంగ్రెస్‌ నేత హోదాలోనే పాదయాత్ర చేపడుతానని స్పష్టం చేశారు. ఏఐసీసీ నుంచి అనుమతి వచ్చిన వెంటనే యాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని, ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ సిగ్గు పడాలని ఎమ్మెల్యే కోమటి రెడ్డి వ్యాఖ్యానించారు. సుమారు 540 గ్రామాలకు మంచి నీరందించే ఉదయసముద్రం ఎండిపోతోందని అధికారులకు, మంత్రి హరీష్‌రావుకు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తాగు నీరందక ప్రజలు రోడ్డెక్కితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. జిల్లాకు ఫ్లోరైడ్‌ నీరందిస్తున్న ఘనత సీఎందేనని ఎద్దేవా చేశారు. మంచినీరందించే విషయంలో కృష్ణా బోర్డును కూడా సీఎం ఒప్పించలేకకపోతున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే కేంద్ర నిధులను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, సర్పంచులు తిరగబడకముందే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సర్కారు కులాల వారీగా రాష్ట్రాన్ని విడగొడుతోందని ఆరోపించారు. నల్గొండ జిల్లాకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నా లేనట్లేనని ఎద్దేవా చేశారు.

>
మరిన్ని వార్తలు